మానవబాంబుగా మారి భార్యను చంపేసిన భర్త...
Published on: Thu Oct 7, 2021 9:14AM
భార్యభర్తల మధ్య గొడవలు సహజం. వివాదాలు తలెత్తడంతో భార్యలను చంపిన భర్తల ఘటనలు చూస్తుంటాం. కొన్ని సార్లు భర్తలు కూడా భార్యల చేతిలో హత్యకు గురైన సందర్భాలుంటాయి. అయితే ఈ ఘటన మాత్రం మరీ దారుణంగా ఉంది. మనస్పర్థలతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించేందుకు ఏకంగా మానవబాంబుగా మారాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని బాంబును పేల్చాడు. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. మానవబాంబుగా మారిన వ్యక్తి 62 ఏండ్లు.
మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది . రోహ్మింగ్లియానా (62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) భార్యాభర్తలు. ఆమె స్థానికంగా కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. అతడు మాత్రం పనీపాట లేకుండా తరచూ భార్యను వేధించడమే పనిగా పెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న రోహ్మింగ్లియానా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
తన ప్లాన్ లో భాగంగా రోహ్మింగ్లియానా.. తన దుస్తుల లోపల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకుని భార్య కూరగాయలు విక్రయించే మార్కెట్‌కు వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అమాంతం ఆమెను కౌగిలించుకుని మీట నొక్కాడు. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. పేలుడు సమయంలో వారి కుమార్తె కొద్ది దూరంలో ఉండడంతో ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ ఘటనలో మిగితావారెవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


