రైలు ప్రయాణం మధ్యలో పాజిటివ్ కన్ఫర్మేషన్.. అధికారుల ఉరుకులు పరుగులు

కరోనా పేరు చెపితే చాలు జనం వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తాజాగా 29 ఏళ్ల ఒక వ్యక్తి కోజికోడ్, తిరువనంతపురం జన శతాబ్ది రైలు లో ప్రయాణిస్తుండగా అతడు మూడు రోజుల క్రితం చేయించుకున్న కరోనా టెస్ట్ రిజల్ట్స్ రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. కరోనా అనుమానంతో అతడు మూడు రోజుల క్రితం టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ వచ్చేలోపు సొంత ఊరిలో గర్భవతి అయిన భార్య ను హాస్పిటల్ లో చేర్చారని సమాచారం రావడంతో రిజల్ట్ తీసుకోకుండానే సొంతూరుకు బయల్దేరాడు. ఐతే అతను రైలులో ప్రయాణిస్తున్న సంగతి తెలుసుకున్న అధికారులు మార్గం మధ్యలో ఉన్న త్రిసూర్ స్టేషన్లో దిగిపోవాలని అతనికి సూచించారు. ఐతే అధికారులు ఆ స్టేషన్ కు చేరుకునే లోపు రైలు స్టేషన్ దాటి వెళ్ళిపోయింది దీంతో అధికారులు తర్వాత వచ్చే ఎర్నాకులం స్టేషన్లో అతడిని రైలు లోంచి దించేసి దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి ఊపిరి పీలుచుకున్నారు. అదే కంపార్ట్ మెంట్ లో అతడితో పాటు ప్రయాణించిన మరి కొంత మందికి మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సలహా ఇచ్చారు.