TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

14 పెళ్లిళ్లు.. 7 రాష్ట్రాల‌కు అల్లుడు.. మామూలుగా లేవుగా లీల‌లు..

Published on: Wed Feb 16, 2022 1:52PM

ఒక్క పెళ్లి చేసుకునేందుకే త‌ల‌ప్రాణం తోక‌కు వ‌స్తోంది. పెళ్లి కాని ప్ర‌సాదుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక పెళ్లి చేసుకున్న వాళ్లు సైతం ప్ర‌శాంతంగా ఏమీ ఉండ‌టం లేదు. విడాకుల సంఖ్యా భారీగా ఉంది. అయితే, ఓ ముస‌లోడు మాత్రం పెళ్లిళ్ల‌తో మ‌జా చేసుకుంటున్నాడు. ఒక‌టి రెండూ కాదు.. ఏకంగా 14మందిని పెళ్లి చేసుకున్నాడు. నిత్య‌పెళ్లికొడుకు అనే ప‌దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారాడు. అయితే, ఏ భార్య‌కూ విడాకులు ఇవ్వ‌లేదు. అంద‌రినీ మోసం చేసే పెళ్లి చేసుకున్నాడు ఈ ప్ర‌బుద్దుడు. ఇత‌గాడి ఖాతాలో డాక్ట‌ర్‌, ప్రొఫెస‌ర్‌, టీచ‌ర్‌, ఓ ఆర్మీ క‌మాండెంట్ సైతం ఉండ‌టం మ‌రింత ఆస‌క్తిక‌రం.

ఒడిశాకు చెందిన‌ ర‌మేశ్‌చంద్ర‌. వ‌య‌సు 60+. పెద్ద‌గా అంద‌గాడేమీ కాదు. కాక‌పోతే మాట‌కారి, మోస‌కారి. అదిచాల‌దా మ‌ళ్లీ మ‌ళ్లీ పెళ్లి చేసుకునేందుకు. 1982లో మొద‌టి పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టి నుంచీ ఇక పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు. గ‌డిచిన 40 ఏళ్ల‌లో.. వేరు వేరు పేర్ల‌తో 7 రాష్ట్రాల‌కు చెందిన 14 మంది మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. గ‌తంలో ఆయ‌నే సొంతంగా మ‌హిళ‌ల‌ను వెతుక్కునేవాడు. ఆ త‌ర్వాత మారిన కాలానికి త‌గ్గ‌ట్టే.. మ్యాట్రిమోని వెబ్‌సైట్‌కి అప్‌గ్రేడ్ అయ్యాడు. హైరేంజ్ ప్రొఫైల్ పెట్టేవాడు. ఆ ప్రొఫైల్‌కు ఎవ‌రైనా ప‌డిపోవాల్సిందే. అలా ఇప్ప‌టి వ‌ర‌కూ 14 మంది మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకున్నాడీ ఘ‌నుడు. ఇక్క‌డే అత‌ను కాస్త‌ తెలివి ప్ర‌ద‌ర్శించారు. ఫ్రెష్ అయితే త‌న‌ను పెళ్లి చేసుకోవ‌డం క‌ష్టమ‌ని గుర్తించి.. విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులకు వ‌లేసి.. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యేవాడు. వైద్యులు, ప్రొఫెసర్లు, టీచర్లు, ఐటీబీపీ అసెస్టింట్  కమాండెంట్ సైతం అతడి బాధితులేనంటే న‌మ్మాల్సిందే. 

లేటెస్ట్ మ్యార‌రేజ్ 2018లో జ‌రిగింది. ఢిల్లీలో 14వ పెళ్లి చేసుకున్న రమేశ్ చంద్ర.. ఆ త‌ర్వాత భార్యను భువనేశ్వర్ తీసుకొచ్చాడు. కొంత‌కాలం త‌ర్వాత‌ ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా అతడి పెళ్లి లీలలు తెలిసొచ్చాయి. అంతే. అవాక్కైపోయింది ఆ భార్య. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. అతడిని అరెస్టు చేశారు.

ర‌మేశ్‌చంద్ర పెళ్లిళ్ల మోస‌గాడే కాదు.. నిరుద్యోగుల‌కు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన చ‌రిత్ర కూడా ఉంది. మ‌న హైద‌రాబాద్‌లోనూ నిరుద్యోగ యువతను మోసగించిన వ్యవహారంలోనూ గ‌తంలో అతడు అరెస్ట్ అయ్యాడు.