TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగాల్లో ముదురుతున్న వార్: గవర్నర్ అకౌంట్ బ్లాక్

Published on: Mon Jan 31, 2022 6:39PM

పశ్చిమబెంగాల్లో రాజకీయ డ్రామా ముదురుపాకన పడింది. అధికార టీఎంసీకి, బీజేపీకి నడుమ రోజురోజుకూ వైరం పెరుగుతోంది. తాజాగా గవర్నర్ జగ్దీప్ ధనకర్ ట్విట్టర్ అకౌంట్ ను సీఎం మమతా బెనర్జీ బ్లాక్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాలు ఏ లెవెల్లో హీటెక్కుతున్నాయో, పార్లమెంట్ సమావేశాల్లో టీఎంసీ ఎంపీలు ఏ లెవెల్లో సభలో అడ్డుపడతారో అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ నిపుణులు. 

గవర్నర్ ధనకర్ ట్వీట్లను భరించలేకపోతున్న మమత ఆయన అకౌంట్ ను బ్లాక్ చేయడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. తన ప్రభుత్వంపై ఆయన చేస్తున్న ట్వీట్లు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని, చాలా ఇబ్బందికరంగా మారాయని చెబుతూ బ్లాక్ చేశారు. ఆ తరువాత కోల్ కతాలో ప్రెస్ మీట్ పెట్టిని మమత.. గవర్నర్ రాష్ట్ర  సీఎస్ ను, డీజీపీని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రధాని మోడీకి ఇదివరకే లేఖల ద్వారా వివరించానని, ధనకర్ ను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరానని చెప్పారు. అటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి కూడా టీఎంసీ నేతల బృందం గవర్నర్ ను తొలగించాలంటూ వినతిపత్రాలు సమర్పించింది. అయినా అటువైపు నుంచి ఆశించిన చర్యలేవీ లేకపోవడంతో ఈ పార్లమెంట్ సెషన్ లోనే గవర్నర్ ను తప్పించేలా ఒత్తిడి చేస్తామంటున్నారు మమత. 

ఇక తన ట్విట్టర్ అకౌంట్ ను మమత బ్లాక్ చేసిన వెంటనే గవర్నర్ జగ్దీప్ ధనకర్ తన అకౌంట్ ద్వారా వరుస ట్వీట్లు చేస్తున్నారు. గవర్నర్ కు ఉండే రాజ్యాంగ బాధ్యతలు, హక్కుల గురించి ఆర్టికల్స్ నెంబర్లు సహా పోస్టు  చేస్తుండడంతో నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 గవర్నర్ కు కట్టబెడుతున్న అధికారాలను, బాధ్యతలను ఫొటో తీసి మరీ ధనకర్ పోస్టు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనాపరమైన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా గవర్నర్ కు తెలియజేయాలని, ఇది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని ఆ ఆర్టికల్ లోని (ఎ) తెలియజేస్తోంది. అలాగే (బి) ప్రకారం పాలనాపరమైన ఏ సమాచారాన్నయినా కోరే అధికారాన్ని గవర్నర్ కలిగి ఉన్నారంటోంది. ఇక అదే ఆర్టికల్ (సి) సెక్షన్ ప్రకారం ఎవరైనా మంత్రి ఏ ప్రతిపాదన చేసినా, దాన్ని ఒకవేళ మంత్రిమండలి సమర్థించకపోయినా ఆ సమాచారాన్ని కూడా గవర్నర్ కు తెలియజేయాలని చెబుతోంది. ఇలా గవర్నర్ కు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, బాధ్యతలను మాత్రమే తాను వినియోగించుకుంటున్నానని, అలాంటింది గత రెండేళ్లుగా తనకు బెంగాల్ ప్రభుత్వ సమాచారాన్ని ఎందుకు బ్లాక్ చేస్తున్నారో తెలియజేయాలంటూ ఘాటైన ట్వీట్లు చేశారు. 

మొత్తానికి బెంగాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో వయా పార్లమెంట్, దేశా రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలంటున్నారు నిపుణులు.