జగన్, కేసీఆర్‌లకు బదులు చంద్రబాబునే నమ్ముకున్న మమతా!  

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారా? ఇలా మాట్లాడితే బీజేపీ అభిమానులు తెగ కామెడి చేస్తుంటారు. మరీ ముఖ్యంగా, సోషల్ మీడియాలో వారి హల్ చల్ అంతా ఇంతా కాదు. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు కూడా ఇదే వరస. చంద్రబాబు చక్రం తిరగలేదంటూ వెటకారాలు! అయితే, ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయం తెలుగు రాష్ట్ర కాషాయ అభిమానులు గుర్తించకపోవటమే పెద్ద విషాదం!

 

 

వచ్చే ఎన్నికల్లో ఏపీ కమలం పరిస్థితి గత ఎన్నికల్లో కాంగ్రెస్ లాగే వుండబోతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం మోదీ , అమిత్ షా కుట్ర రాజకీయాలే. దానికి తగ్గట్టే చంద్రబాబు వరుసగా తెలివైన అడుగులు వేస్తూ వస్తున్నారు. చర్చ మొత్తం ప్రత్యేక హోదా వైపు మరల్చటంతో రాష్ట్రంలో బీజేపీ అతి పెద్ద విలన్ అయింది. ఆ విలన్ కి తోక పార్టీగా వైసీపీని నిలబెట్టడం కూడా చంద్రబాబు వ్యూహమే! అది ఫలించిందనే చెప్పుకోవాలి. అయితే, చంద్రబాబు తిప్పిన చక్రం అసలు ఎఫెక్ట్ దిల్లీలో పడబోతోంది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీకి ఇక్కడ సున్నా స్థానాలు వచ్చిన నష్టమేం లేదు. కానీ, దిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు డ్యామేజ్ భారీగానే వుండబోతోంది… అదే మోదీ, షాలు ఆలోచించుకోవాల్సిన సంగతి!

 

 

జాతీయ స్థాయిలో తాజా పరిణామాలు చూస్తే … బెంగాలీ రెబెల్ మమతా బెనర్జీ దిల్లీ చేరారు. సోనియా, రాహుల్ తో భేటీ అయిన ఆమె ప్రధాని రేస్ లో లేనని ప్రకటించారు. ముందు బీజేపీ కుట్రల్ని ఛేదించి అంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ వ్యతిరేక టీమ్ గా మారి ఎన్నికలు ఎదుర్కొంటే తరువాత పీఎం ఎవరన్నది ఆలోచించవచ్చని మమతా మాట. అంటే, ఎన్నికల్లో మోదీని, బీజేపీ అరికడితే … తరువాత అందరికీ సమ్మతమైన నేతని పీఎం చేయవచ్చని ఆమె ఆలోచన! ఇప్పుడున్న స్థితిలో ఇంత కంటే వేరే మార్గం లేదు మోదీ వ్యతిరేక వర్గానికి. ఎందుకంటే, కాంగ్రెస్ అధినేత రాహుల్ అందరికీ ఆమోదం కాదు. అలాగే, ప్రాంతీయ నేతలు కూడా ఏ ఒక్కరూ ప్రధాని పదవికి ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపించటం లేదు. అందుకే, ఆమె ముందు ఎన్నికలు, తరువాత పీఎం కుర్చీ అన్నారు.

 

 

 

 

మమతా బెనర్జీ సోనియా, రాహుల్ ని కలవటమే కాక టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వార్ని మోదీ వ్యతిరేక పోరు చేస్తున్నందుకు అభినందించారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సూత్రంతో మమతా టీడీపీకీ దగ్గరవుతున్నారు. మరీ ముఖ్యంగా, మమతా బెనర్జీ ఈ నెలలో దిల్లీలో నిర్వహించబోయే ర్యాలీకి చంద్రబాబును ఆహ్వానించారు. దీనిపై ఏపీ సీఏం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ తృణముల్, టీడీపీల నడుమ మైత్రికి ఇది సంకేతమనే చెప్పాలి. ఆ మద్య కేసీఆర్ స్వయంగా కోల్ కతా వెళ్లి తన కూటమిలో చేరమంటే పెద్దగా స్పందించని బెంగాలీ సీఎం చంద్రబాబును స్వయంగా ఆహ్వానించారు! ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు దిల్లీలో మంచి పరిణామమే. మోదీకి బెదరకుండా ఎదురు నిల్చి పోరాడుతున్న ఆయన ఇప్పుడు జాతీయ మీడియా, జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీజేపీకి, మోదీకి పట్టు అతి తక్కువగా వుండే దక్షిణాదిలో చంద్రబాబు లాంటి కమాండర్ వుండటం మమతా బెనర్జీ లాంటి వారికి చాలా అవసరం!

 

 

మమతా బెనర్జీ ర్యాలీకి హాజరై చంద్రబాబు మోదీ వ్యతిరేక వర్గంలో కీలకంగా మారతారో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ, ఏపీ నుంచీ మమతా బెనర్జీ లాంటి వారు ఆయననే నమ్మదగ్గ నేతగా చూస్తున్నారనేది మాత్రం స్పష్టం. జగన్ కూడా అధికారికంగా మోదీ వర్గం కాకున్నా మమతా బెనర్జీ ఆయనని ఆహ్వానించలేదు. ముందు ముందు కూడా కేసీఆర్, జగన్ లు జాతీయ రాజకీయాల్లో ఒంటరయ్యే అవకాశాలే ఎక్కువ. మోదీ వ్యతిరేక వర్గం కూటమిలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు చక్రం తిప్పటం పక్కా!