TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ ఆఫీస్ డోర్ పగులగొట్టి.. టీఎంసీ గుర్తు పెయింట్ చేసిన మమతా

Published on: Tue Jun 4, 2019 11:54AM

 

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఇరుపార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు అయితే టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కనిపిస్తే చాలు.. 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయినా మమత తన దూకుడు తగ్గించట్లేదు. తాజాగా ఓ ఘటనతో తనని అందరూ ఫైర్ బ్రాండ్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి రుజువు చేశారు మమత.

నార్త్ 24 పరగణాల జిల్లా పరిధిలోని నైహతిలో ఉన్న బీజేపీ కార్యాలయం దగ్గరకు వెళ్లి, తలుపులు పగులగొట్టించిన మమత.. కాషాయపు రంగేసున్న గోడలపై తృణమూల్ కాంగ్రెస్ పేరు, గుర్తును పెయింట్ చేశారు. ఆమే స్వయంగా తృణమూల్ గుర్తు (మూడాకుల మొక్క, గడ్డి)ను గోడపై పెయింట్ చేశారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. గత నెల 30న జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

అయితే టీఎంసీ శ్రేణులు మాత్రం ఈ ఘటనను సమర్ధించుకుంటున్నాయి. అది తమ పార్టీ కార్యాలయమేనని, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ అనుచరులు బలవంతంగా లాక్కున్నారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం.. మమత తీరుపై మండిపడుతోంది. ఆ పార్టీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదని పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు.