చంద్రబాబుకి ట్విస్ట్ ఇచ్చిన మమతా బెనర్జీ.. ఫలితాల తర్వాతే
Published on: Sat May 11, 2019 12:21PM

ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ కూటమి గురించి చర్చలు వద్దని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. టీడీపీ అధినేత చంద్రబాబుకి సూచించినట్లు తెలుస్తోంది. నిజానికి మే 21న బీజేపీయేతర పార్టీలతో ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారు. అయితే ఈ సమావేశానికి రావడానికి మమతా నో చెప్పినట్లు తెలుస్తోంది.
బెంగాల్‌లో రెండ్రోజులపాటు మమతా తరపున ప్రచారం చేసిన చంద్రబాబు.. సమావేశం విషయాన్ని మమతాతో గురువారం రాత్రి జరిగిన భేటీలో చర్చించారు. ఢిల్లీలో జరిగే సమావేశం 21న అనుకుంటే.. ఫలితాలు వచ్చేది 23న. అంటే మధ్యలో గ్యాప్ ఒక్కరోజే. అంత తక్కువ టైంలో ఓ సమావేశం పెట్టుకోవడం మంచిది కాదని మమతా బెనర్జీ అన్నారట. ప్రస్తుతం పార్టీలన్నీ ఈవీఎంల భద్రతపై దృష్టి సారించడం మంచిదన్న ఆమె.. ఎన్నికల తర్వాతే కలుద్దామని చంద్రబాబుకి సూచించారట.
మమతా బెనర్జీ ప్రధాని పదవి కావాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందే కూటమిలో చేరిపోతే, ఆ తర్వాత తన డిమాండ్ నెరవేర్చుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న మమతా బెనర్జీ.. ముందుగానే చంద్రబాబు ప్రయత్నాలకు బ్రేక్ వేశారని తెలుస్తోంది. ఎన్నికల్లో తృణమూల్‌కి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే, అప్పుడు తన డిమాండ్‌ని మిగతా పార్టీల ముందుంచి, ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. అందుకే ఫలితాలు వచ్చేవరకు కూటమితో కలవకుండా తటస్థ వైఖరితో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


