పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం ఆట బొమ్మ కాదు: మమత

 

 

లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో బెంగాల్లో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పట్టు కోసం బిజెపి, ఉన్న అధికారం నిలుపుకోవడానికి తృణమూల్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల హత్యలతో రాష్ట్రం రణరంగంగా మారుతోంది.  ఈ నేపథ్యంలో గవర్నర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ధ్వంసానికి గురైన ఈశ్వరచంద్ విగ్రహాన్ని ఈ రోజు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విద్యాసాగర్ కాలేజీలో తిరిగి ప్రతిష్టించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆమె బిజెపి, మోడీ మరియు అమిత్ షా ల పై నిప్పులు చెరిగారు. "పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం. బెంగాలీలు ఆత్మగౌరవంతో నివసిస్తున్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడానికి బెంగాల్ ఒక ఆట బొమ్మ కాదు.. అంతేకాదు మీరు  బెంగాల్‌లో అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలి పోతుందని బిజెపి పై మండిపడ్డారు. టీఎంసీ కార్యకర్తలు ప్రత్యర్థులపై దాడిచేయరని, ఒకవేళ అలా చేస్తే తనే వారి చెంప చెళ్లుమనిపిస్తానని మమత స్పష్టంచేశారు. అబద్దాలు  చెప్పి బిజెపి హింసను ప్రేరేపిస్తుందని ఆమె దుయ్యబట్టారు. ఇటీవల రాష్ట్రం లో జరిగిన దాడుల్లో మొత్తం 10 మంది చనిపోతే .. వారిలో 8 మంది టీఎంసీ కార్యకర్తలేనని వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.