మేక వన్నె పులుల్లాంటి… మేకప్ వన్నెల హీరోలు!

 

సినిమా స్టార్స్… ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు దేవుళ్లు! అంతగా అభిమానిస్తారు ఫ్యాన్స్! అది తెలుగు, హిందీ, తమిళ, మలయాళ రంగం… ఏదైనా… ఎక్కడికక్కడ స్టార్ హీరోలుంటారు. వారంటే పడి చచ్చే అభిమానులూ వుంటారు. అంతేకాదు, తమ హీరోని ప్రేరణగా తీసుకుని హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మొదలు జనానికి ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాల వరకూ అన్నీ చేసేస్తారు. మన దగ్గరైతే పవర్ స్టార్ పేరు మీద పవనిజం అంటూ ఒక ఇజమే పుట్టుకొచ్చింది! అంతలా క్రేజ్ సమాజంలో బహుశా మరెవరికీ వుండదనుకుంటా!

 

కొన్ని లక్షల మంది, కాదంటే, కొన్ని కోట్ల మంది జనం తమని ఆరాధిస్తుంటే హీరోలు ఎలా వుండాలి? తమని దేవుడనుకుంటున్నారు కాబట్టి దేవుడిలాగే ఏ లోపమూ లేకుండా వుండాలి. అది కుదరకపోతే కనీసం మనుషుల్లా అయినా వుండాలి. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ రాక్షసుడిలా మారి గ్లామర్ ఇండస్ట్రీ మరో కోణాన్ని చూపించాడు! తనతో మంచి హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ భావనపై కసి, పగ పెంచుకున్నాడు. అందుకు కారణాలు బోలెడు వుండవచ్చు. కాకపోతే, ఇప్పటి వరకూ తెలిసిన విషయాల ప్రకారం దిలీప్ మొదటి భార్య మంజు వారియర్. ఆమెతో విడాకుల టైంలో భావన దిలీప్ ని తప్పు పట్టింది. మంజు వైపున నిలిచింది. అయినా కూడా మల్లూవుడ్లో విపరీతంగా పలుకుబడి వున్న దిలీప్ ఫస్ట్ వైఫ్ కు విడాకులు ఇచ్చి కావ్యా మాధవన్ అనే మరో హీరోయిన్ ని పెళ్లాడాడు!

 

తనకు నచ్చినట్టు  రెండో వివాహం చేసుకున్న దిలీప్ అక్కడితో తృప్తి పడితే బావుండేది. తనని వ్యతిరేకించిన భావనపై పగ పెంచుకుని ఆమె జీవితాన్నే నాశనం చేయాలని అనుకున్నాడు. ఒకటిన్నర కోట్ల సుపారీకి అగ్రిమెంట్ కుదుర్చుకుని ఆమెని లైంగికంగా వేధించిన విజువల్స్ సంపాదించాలని అనుకున్నాడు! ఒక మహిళ పట్ల, ఒక సెలబ్రిటీ అయిన హీరోయిన్ పట్ల హీరోగారు ఇలా ఆలోచించటం … ఎవరమైనా నమ్మగలమా?

 

దిలీప్ అనే హీరో విలన్ వేషాలే కాదు… చరిత్రలో చాలా మంది ఆన్ స్క్రీన్ హీరోలు రియల్ లైఫ్లో విలన్లుగానే బిహేవ్ చేస్తుంటారు. అసలు ఒక స్థాయి స్టార్ డమ్ వచ్చాక వారికి పరిశ్రమలో తిరుగుండదు. అందుకే, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, నటీనటులు అన్నభేదం లేకుండా అందర్నీ వేధిస్తుంటారు. ఏ కారణం లేకున్నా అవమానిస్తుంటారు. ఇక అసిస్టెంట్లుగా పని చేసే చిన్న చిన్న వారిపై ఇండస్ట్రీలోని పెద్దవారి దౌర్జన్యం అంతా ఇంతా కాదు! ఓ టాప్ హీరో తన అసిస్టెంట్ ని అందరి ముందు బూతులు తిట్టి ముఖం పచ్చడయ్యేలా కొట్టినా అడిగే వాడు వుండడు! అందరికీ స్టార్ డమ్ సంపాదించిన వారంటే వణుకే! ఏమన్నా తేడా వస్తే ఇండస్ట్రీలో లేకుండా చేసేస్తారని భయం!

 

సినీ పరిశ్రమలో అజమాయిషి, అమానుషత్వం ఎంత తవ్వి చూస్తే అంతగా బయటకి వస్తుంది. కాకపోతే, కొందరు సినీ సెలబ్రిటీలకు అహంకారం విపరీతంగా పెరగటానికి ఫీల్డ్ లో వారికి లభించే ఎదురులేని అధికారమే కారణం. అదే దిలీప్ లాంటి హీరోల చేత ఎంతటి నీచమైన పనైనా చేయిస్తుంది. అసలు సినీ పరిశ్రమలో హీరోయిన్స్, ఇతర లేడీ అర్టిస్టుల పరిస్థితి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనకు తెలిసింది కేవలం ఒక్క భావన గురించే! భారతీయ సినిమా రంగంలో ఎందరో భావనలు, ఎందరెందరో దిలీప్ లు!

 

ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన దిలీపే కాదు… ఎప్పట్నుంచో న్యూస్ లో వున్న సల్మాన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తప్ప తాగి అమాయకుల మీదకు కారెక్కించిన ఆన్ స్క్రీన్ హీరో అడవుల్లోకి పోయి జింకల్ని కూడా వదలకుండా వేటాడాడు. ఐశ్వర్య రాయ్ విషయంలో భౌతిక దాడి చేశాడనీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక సంజయ్ దత్ అయితే ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు ఆక్రమ ఆయుధాల కేసులో! ఇలాంటి హీరోలు ఇంకా చాలా మంది వున్నారు. అందరూ జైలు దాకా వెళ్లకపోవటంతో మనకు వారి అసలు స్వరూపాలు తెలియవు!

 

సినిమా హీరోలందరూ దిలీప్, సల్మాన్, సంజయ్ దత్ లాంటి వారు కాకపోవచ్చు. కాని, చాలా మంది హీరోలు మామూలు వారేనని జనం గుర్తించాలి. వారికి కూడా బలహీనతలు, చెడు ఆలోచనలు వుంటాయి. అందుకే, ఫ్యాన్స్ అని చెప్పుకునే వారు నటన వరకే అభిమానించాలి. అలా కాకుండా తమ హీరోల్ని దేవుళ్లని చేసి ఆరాధించటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మీడియా కూడా అవసరం వున్నా లేకున్నా సినిమా సెలబ్రిటీల్ని హైలైట్ చేయటం తగ్గించుకోవాలి. అప్పుడు ఎంత పెద్ద సినిమా పర్సన్ తప్పు చేసినా వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోటానికి అడ్డంకులు లేకుండా వుంటుంది! కాని, ఇప్పుడు ఇండియాలో పరిస్థితి అలా లేదు. ఒక్కోసారి పొలిటీషన్స్ కూడా తప్పించుకోలేని నేరాల నుంచి గ్లామర్ వున్న వాళ్లు తేలిగ్గా తప్పించేసుకుంటున్నారు! ఈ పరిస్థితి ఖచ్చితంగా మారాలి…