TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published on: Thu Jun 4, 2026 2:27PM

 

హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రివనం సమీపంలోని ప్రధాన రోడ్డుపై పిల్లర్ నంబర్ 1043 వద్ద ఉన్న KSR ఫ్యాషన్స్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు దుకాణం మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది.

మంటలను గమనించిన స్థానికులు, వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా సమీపంలోని హర్ష మెస్ వరకు పొగ వ్యాపించడంతో అక్కడి సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తమై బయటకు వచ్చారు. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

షాప్‌లో పెద్ద మొత్తంలో వస్త్రాలు, ఇతర సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా అమీర్‌పేట్ ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.