విశాఖ పోర్టులో ఘోర ప్రమాదం.. జస్ట్ మిస్...

 

విశాఖ పోర్టులో ఒక ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒక ప్రైవేట్ షిప్ విశాఖ పోర్టులో ప్రైవేటు పడవలు రాకూడని ప్రదేశానికి దూసుకుని వచ్చేసింది. ఆ ప్రదేశంలో వున్న భారీ గ్యాస్ నిల్వల బెర్త్‌ని ఢీకొనబోయి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఆ ప్రైవేట్ షిప్ గ్యాస్ నిల్వల బెర్త్‌ని ఢీకొని వుంటే ఘోర ప్రమాదం సంభవించి వుండేదని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదమే జరిగి వున్నట్టయితే మూడు నాలుగు నెలలపాటు పోర్టు కార్యకలాపాల మీద ఆ ప్రమాద ప్రభావం వుండేదని చెబుతున్నారు. సీవే షిప్పింగ్ సంస్థకి చెందిన ‘జలవాహిని’ అనే ఆ షిప్ కెప్టెన్‌ గత కొన్ని రోజులుగా తమ సంస్థ యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆ మానసిక ఒత్తిడిలో షిప్పును ఎలా పడితే అలా నడపడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేని ప్రదేశంలోకి వేగంగా వస్తున్న షిప్పును చూసి సెక్యూరిటీ సిబ్బంది హెచ్చరికలు చేసినా షిప్ కెప్టెన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ చివరి నిమిషంలో షిప్‌ను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ షిప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ కేంద్ర మంత్రి వారసులకు చెందినదిగా తెలుస్తోంది.