పోలీసును ఏసీబీకి పట్టించిన దొంగలు!!

 

పోలీసు దొంగల్ని పట్టుకోవడం రొటీన్.. దొంగలే పోలీసుని పట్టిస్తే అది వెరైటీ. అలాంటి వెరైటీ సంఘటనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది.  వారం రోజుల కిత్రం మహేశ్వరం మండలంలోని కల్వకోల్, నాగిరెడ్డిపల్లి, గొల్లూరు గ్రామాల్లో పొలం వద్ద పశువుల పాకలో కట్టేసిన గేదెలను దొంగలు అపహరించుకుపోయారు. గేదెలు పోయిన రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి ఈ దొంగతనం కేసును ఛేదించారు. అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన రాజు గేదెలను దొంగిలించాడని గుర్తించి పోలీస్‌ స్టేషన్‌ తీసుకొచ్చి విచారించారు. దొంగిలించిన గేదెలను మొయినాబాద్‌కు చెందిన సయ్యద్‌ నజీర్, ఖలీద్‌కు సర్ధార్‌నగర్‌ సంతలో విక్రయించానని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులు నజీర్, ఖలీద్‌లను విచారించడంతో.. కొనుగోలు చేసిన గేదెలను సంగారెడ్డికి చెందిన గేదెల వ్యాపారి హర్షద్‌కు విక్రయించామని వారు తెలిపారు. ఈ దశలో ఎస్‌ఐ నర్సింహులు కేసును తన చేతిలోకి తీసుకొని గేదెల దొంగతనం చేసిన రాజు, కొనుగోలు చేసిన సయ్యద్‌ నజీర్, ఖలీద్, హర్షద్‌లను పోలీసులకు స్టేషన్‌కు తీసుకొచ్చి బెదింపులకు దిగాడు. అడిగినవన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని, బెయిల్‌ రాకుండా చేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన గేదెల వ్యాపారి సయ్యద్‌ నజీర్‌.. ఎస్సై లక్ష రూపాయలు డిమాండ్‌ చేస్తే రూ. 60 వేలు ఇచ్చాడు. అప్పటికే మరో చోరీ కేసులో నిందితుడిగా ఉన్న హర్షద్‌ను రూ. 1.10 లక్షలు ఇస్తే నామమాత్రం కేసులు పెట్టి వదిలేస్తానని, ఇవ్వకపోతే పెద్దకేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించడంతో అంత డబ్బులు తాను ఇవ్వలేను రూ. 80 వేల రూపాయాలు ఇస్తానని.. గురువారం పోలీస్‌ స్టేషన్‌ వచ్చి నేరుగా మీకే డబ్బులు ఇస్తానని ఎస్‌ఐకి చెప్పాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న ఎస్‌ఐను ఏసీబీ అధికారులకు పట్టించి తగిన బుద్ధి చెప్పాలని హర్షద్‌ నిర్ణయించుకున్నాడు. గురువారం ఉదయం నాంపల్లిలో ఉన్న ఏసీబీ అధికారులను హర్షద్‌ ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ముందుగానే ప్రణాళిక వేసుకొని.. ఎస్‌ఐ నర్సింహులు హర్షద్‌ వద్ద నుండి రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.