కొందరు జడ్జ్‌లు.. కొన్ని కామెంట్లు.. బోలెడు షాకులు

 

ప్రజాస్వామ్యంలో ఓటర్లు, ప్రజా ప్రతినిధులు, చట్ట సభలు ఎంత కీలకమో అంతే ముఖ్యం… న్యాయస్థానాలు! కోర్టులు, లాయర్లు, జడ్జీలు లేకుంటే దేశం అస్తవ్యస్తం అవుతుంది అనటంలో సందేహం లేదు. అందుకే, అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలతో తారు మారు అయ్యే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కన్నా ఎక్కువ స్వేచ్ఛా, అధికారం, గౌరవం న్యాయమూర్తులు పొందుతుంటారు. వారి నిర్ణయాన్ని మీడియా కూడా ఇష్టానుసారం విమర్శించదు. తప్పుబట్టదు. అలాంటి వెసులుబాటు కూడా ఒకింత రాజ్యాంగమే కల్పించింది న్యాయ వ్యవస్థకి! కాని, ఒక్కోసారి మన జడ్జ్ లు చేసే కామెంట్స్ వింటే షాకైపోతుంటాం! ఎంతో ముఖ్యమైన స్థానంలో వుండి ఇలా మాట్లాడారేంటి అనిపిస్తుంది!

 

రాజస్థాన్ హైకోర్ట్ న్యాయమూర్తి మహేష్ చంద్ర  ఈ మధ్యే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించమని కేంద్రానికి సూచించారు. అదే పెద్ద సంచలనం అయింది. కాని, ఆ క్రమంలో ఆయన మాట్లాడిన ఒక మాట మరింత కలకలం రేపింది! ఆవు కూడా నెమలి లాంటి పవిత్రమైన ప్రాణి అన్నారాయన! ఎందుకంటే… నెమలి తన జీవిత కాలంలో ఎప్పుడూ శృంగారంలో పాల్గొనదు. ఆడ నెమలి మగ నెమలి కన్నీళ్లు తాగేయటం ద్వారా గర్భం ధరిస్తుంది. ఆవు కూడా అటువంటి ఒక పవిత్రమైన జంతువు అన్నారు! అసలు నిజంగా నెమలి శృంగారం జోలికి వెళ్లని ఆజన్మ బ్రహ్మచారా? కాదంటోంది సైన్స్! పురాణాల్లో ఎందుకు అలా చెప్పారో కాని నిజంగా మాత్రం నెమళ్లు శారీరికంగా సంభోగించి మాత్రమే పిల్లల్ని కంటాయి! ఈ విషయం ఒక న్యాయమూర్తి అయిన మహేష్ చంద్రకి తెలియకపోవటమే… నిజంగా ఆశ్చర్యకరమే!

 

ఒక్కసారి మనం గతంలోకి తొంగి చూస్తే.. 2013లో విరేంద్ర భట్ అనే న్యాయమూర్తి మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 19-24 ఏళ్ల మధ్య వున్న అమ్మాయిలు చాలా సందర్భాల్లో అబ్బాయిలతో ఇష్టపడే శృంగారంలో పాల్గొంటారనీ, తరువాత ఇంటికి తిరిగి వచ్చి పెద్దలకు భయపడి కిడ్నాప్, రేప్ అంటూ కట్టు కథలు అల్లుతారనీ ఆయన అన్నారు! ఈ విషయంలో ఆయన్ని దిల్లీ హై కోర్ట్ చీవాట్లు కూడా పెట్టింది! ఇక వీరేంద్ర భటే మరోసారి … అబ్బాయి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికితే అమ్మాయి పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనటం తప్పు. అలా చేస్తే అది రేప్ కిందకి రాదు. అన్నీ తెలిసిన మేజర్ అయిన అమ్మాయి పెళ్లి చేసుకోకుండా శృంగారంలో పాల్గొంటే దానికి బాధ్యత కూడా ఆమెదే అంటూ తీర్పునిచ్చారు! పెళ్లికి ముందు శృంగారం ఏ మతం కూడా ఒప్పుకోదని ముక్తయింపు కూడా ఇచ్చారు!

 

కేరళ కోర్టుకు చెందిన జస్టిస్ బసంత్ మరింత వివాదాస్పద కామెంట్లు చేశారు ఆ మద్య! ఒక రేప్ కేసులో ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుతూ … అమ్మాయిని చైల్డ్ ప్రాస్టిట్యూషన్ కి వాడుకున్నారని ఎన్నో ఆధారాలు వున్నాయి. అంతే తప్ప రేప్ జరగలేదు అన్నారు!

 

ఇక మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే! భారతీయులు స్టుపిడ్స్, ఇడియట్స్ అనటం మొదలు సుప్రీమ్ కోర్టును కూడా సోషల్ మీడియాలో తిట్టిపోయటం వరకూ ఆయన చేయని గందరగోళం లేదు. మన దేశ రాష్ట్రపతిగా కత్రీనా కైఫ్ ను చేయాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు! ఎందుకంటే, ఎవరు ప్రెసిడెంట్ అయినా జనానికి చేసేది ఏం లేదు కాబట్టి… అందమైన ముఖం వున్న కత్రీనా అయితే మీడియాలో కనిపించినంత సేపూ హాయిగా వుంటుందట! ఆమె రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక షీలాకీ జవానీ పాట కూడా పాడాలనీ కోరారు కట్జు! ఆయన రసికత్వాన్ని మనం ఏం అనగలం?

 

సుప్రీమ్ కోర్టు జడ్జులకు అయిదేళ్ల శిక్ష వేసి … తనకు వారి చేతుల్లో ఆర్నెళ్ల జైలు శిక్ష వేయించుకున్న  కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కర్నన్ కూడా మన దేశ జడ్జ్ ల విచిత్ర వ్యవహార శైలికి నిదర్శనం! ఆయన ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే ధిక్కరించారు! ఎందరికో శిక్షలు వేసిన ఆయన తనకు సుప్రీమ్ కోర్టు శిక్ష వేస్తే గౌరవించకుండా, తప్పించుకుని అజ్ఞాతంలో వుండిపోయారు!