రచయిత్రి మహాశ్వేతా దేవీ అస్తమయం..

ప్రముఖ కవయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహశ్వేతా దేవీ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1926 జనవరి 14న అవిభక్త భారతదేశంలోని ఢాకా(ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని)లో మహశ్వేతా దేవీ జన్మించారు. మొదటి నుంచి సాహితీ వేత్తల కుటుంబం కావడంతో ఆ ప్రభావం శ్వేతా దేవీపై పడింది. ఆమె విద్యాభ్యాసం ఢాకాలోనే పూర్తయ్యింది. దేశ విభజన తర్వాత వారి కుటుంబం వారి కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది.

 

అనంతరం రవీంద్రుని విశ్వభారతీ విశ్వవిద్యాలయంలో బీఏ, కోల్‌కతా యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ను పూర్తి చేశారు. బిజాన్ భట్టాచార్య అనే ప్రముఖ నాటక రచయితను ఆమె వివాహం చేసుకున్నారు. శ్వేత రచించిన హజార్ చౌరాసిర్ మా, బ్రెస్ట్ స్టోరీస్, టిన్ కోరీర్ సాధ్ వంటి రచనలను సినిమాలుగా కూడా తెరకెక్కించారు. మరో సామాజిక ఉద్యమకారిణిగా గిరిజన ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేశారు. వివిధ రంగాల్లో శ్వేతాదేవీ చేసిన సేవలకు గానూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు, పద్మవిభూషణ్, జ్ఞాన్‌పీఠ్, మెగసెసె తదితర అవార్డులు ఆమెను వరించాయి. శ్వేతాదేవీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.