స్కూలు టీచర్‌కు మిలియన్ డాలర్ల ప్రైజ్‌ మనీ

మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్ డిసేల్ (32) ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నారు. మన దేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి డిసేల్ ఈ ఘనత సాదించారు. అంతేకాదు, తన ప్రైజ్‌ మనీలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ప్రకటించారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా ఒక్కొక్కరికి 55 వేల డాలర్లు చొప్పున ఇస్తానని తెలిపారు. 

 

2009 లో పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసేల్ వచ్చినప్పుడు.. ఆ పాఠశాల దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌ గా తీసుకున్న డిసేల్ పాఠశాల రూపురేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామంలోని 100శాతం బాలికలను పాఠశాలకు హాజరయ్యేలా కృషి చేశారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లను తీసుకొచ్చారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రకటించింది.