అక్టోబర్ 21 నుంచి నవంబర్ 26 వరకు... మహారాష్ట్రలో ఏ రోజు ఏం జరిగిందంటే...!

# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి.
# (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు. 
# (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది.
# (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. 
# (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు.
# (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. 
# (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు.
# (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది.
# (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది.
# (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు.
# (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి. 
# (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది.
# (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి. 
# (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 
# (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.