వరదలలో మంత్రి గారి సెల్ఫీ సరదాలు, ఫైరవుతున్న నెటిజన్లు

 

 

మహారాష్ట్ర లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనితో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అలా నీట మునిగిన సాంగ్లీ జిల్లాలోని ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి గిరిరాజ్ మహాజన్ బోటులో వెళ్లారు. రోడ్లు దెబ్బతిని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు దెబ్బ తిన్న, అలాగే ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులకు ధైర్యం చెప్పాల్సిన సదరు మంత్రి గారు కొన్ని చోట్ల ఆగి సెల్ఫీ వీడియోలు  తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మంత్రిగారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోలో ఆ మంత్రి గారు కెమెరా వంక చూసి నవ్వుతూ, చేతులు ఊపుతూ ఉల్లాసంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనితో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ఓదార్చాల్సిన సదరు మంత్రి గారు అంత జాలీగా ఎలా ఉంటారంటూ విపక్షాలు మాటల యుద్దానికి తెరలేపాయి. అదే క్రమంలో ఎన్సీపీ లీడర్ ధనుంజయ్ ముండే ఐతే సదరు మంత్రి తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.