TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు జీవో.. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Published on: Wed Feb 18, 2026 3:24PM

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం   కింద ముస్లింలకు అమల్లో ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం   రద్దు చేసింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం మంగళవారం(ఫిబ్రవరి 17) రాత్రి జీవో జారీ చేసింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల  వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు  ఈ కోటా ఇకపై  ఉండదని స్పష్టం చేసింది. 
2014లో అప్పటి నేతృత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పట్లో ఈ ఆర్డినెన్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి.   2014 నవంబర్ 14న హైకోర్టు ముస్లింలకు 5శాతం రిజర్వేషన్లపై మధ్యంతర స్టే విధించింది. తరువాత ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు తీర్పులు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా   రిజర్వేషన్ పూర్తిగా అమలులోకి రాలేదు. డిసెంబర్ 23, 2014 నాటికి శాసనసభ ఆ ఆర్డినెన్స్‌ను చట్టంగా ఆమోదించకపోవడంతో గడువు ముగిసింది.

అయినప్పటికీ అధికారికంగా రద్దు ప్రకటన లేకపోవడంతో ఈ రిజర్వేషన్ అంశం ఎటూ తేలకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉండీ లేనట్లుగా కొనసాగుతోంది.  దాదాపు పుష్కర కాలం తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ముస్లింలకు 5శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. చట్టపరంగా అమలులో లేని కోటాని రద్దు చేసింది. అలా రద్దు చేస్తూ, ఇది కేవలం చట్టపరమైన స్పష్టత కోసం తీసుకున్న నిర్ణయమేననీ,  అమలులో లేని అంశానికి ఫుల్ స్టాప్ పేట్టేశామని పేర్కొంది. 

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ముస్లింలకు పెద్ద దెబ్బగా పేర్కొంది. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని విమర్శించింది. ఎంఐఎం అయితే దీనికి రంజాన్ తోఫాగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముస్లింల రిజర్వేషన్ అంశం మళ్లీ రాజకీయంగా ప్రధాన్యతను సంతరించుకుంది.  మహారాష్ట్రలో రానున్న ఎన్నికలలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.