మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు!

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్‌ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా చర్చించింది. ఢిల్లీలో పరిస్థితులను చూస్తుంటే మహారాష్ట్రలో పృథ్విరాజ్ చౌహాన్ కొంప మునిగినట్టే కనిపిస్తోంది. మహారాష్ట్రలోని కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి ప‌ృథ్విరాజ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈమధ్య జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. పృథ్విరాజ్‌ని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికలలో లో కూడా ఘోరంగా ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పదవినుంచి తొలగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, రెండో వ్యక్తి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ తోరట్, మూడో వ్యక్తి మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విఖే పాటిల్. ఈ ముగ్గురిలో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అయ్యేదీ శుక్రవారం నాడు క్లారిటీ వచ్చే అవకాశం వుంది.