రెండు రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా.. హుజూర్‌నగర్‌ పోరు కూడా ఆరోజే

 

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ఒక్క కాలమ్ పూర్తి చేయకపోయినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని చెప్పారు. క్రిమినల్ రికార్డు ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను సమర్పించాని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఖర్చు పరిశీలనకు అధికారులను నియమిస్తామని తెలిపారు. ఒక్కో అభ్యర్థి రూ. 28 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదలకానుందని సీఈసీ తెలిపారు. నామినేషన్లకు అక్టోబర్ 4 చివరి తేది కాగా, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 5న జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఫలితాలు విడుదలకానున్నాయని సీఈసీ తెలిపారు. కాగా, మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అదేవిధంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయని సీఈసీ తెలిపారు. తెలంగాణలోని హుజూర్‌నగర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చత్తీస్‌ఘర్, అస్సామ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల్లో ఉపఎన్నికలున్నాయి. హుజూర్‌నగర్‌ లో కూడా అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది.