మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ వ్యూహం ఏమిటి?

 

మోదీ ఏ పని చేసినా అందులో ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు మోదీ దృష్టి మొత్తం మహారాష్ట్ర ఎన్నికల పైనే ఉంది  .లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయంతో జోష్ మీదున్న ప్రధాని మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు కొత్త ఫార్ములాలను తెరపైకి తెస్తున్నారు.

నరేంద్రుడు, దేవేంద్రుడి కాంబినేషన్ లో అద్భుతాలు ఖాయమని గత ఐదేళ్లలో ఆ సంగతిని నిరూపించి చూపామని మోదీ అంటున్నారు. దేవేంద్రుడు అంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. గడిచిన ఐదేళ్ల పాలనలో దేవేంద్రుడి పాలనను అందరూ మెచ్చుకున్నారని అందుకే ఆయనకు మరో ఐదేళ్లు ఇవ్వబోతున్నారని మోదీ వెల్లడించారు. తాను, దేవేంద్రుడు ఒకే చోట నుంచుంటే అది వన్ ప్లస్ వన్ టూ అని కాకుండా ఎలవెన్ అని చెప్పాల్సి ఉంటుందన్నారు.

మహారాష్ట్రలో పలు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ఓటర్లను ఉత్తేజపరిచే ప్రసంగాలు చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ పాలనలో మహారాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఆయన సంక్షేమ పథకాలు సజావుగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

జాతీయ సంపద వృద్ధి చెందడంలో మహారాష్ట్ర కీలక భూమిక పోషించిందన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు ప్రస్తావించకూడదని కాంగ్రెస్ ను మోదీ నిలదీశారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వని విపక్షాలు సిగ్గుతో చచ్చిపోవాలని ఆయన అన్నారు.

అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు ఎన్సిపికి కుటుంబ సంక్షేమం మాత్రమే అవసరమని వారికి జమ్మూ కశ్మీర్ తో పాటు దేశం పై మక్కువ లేదని మోదీ ఆరోపించారు. ఇక ఓటమి భయంతోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతకాలం ప్రచారానికి రాలేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సెటైర్ లు వేశారు. ఇప్పుడు కూడా రాహుల్ ప్రచార సభలకు జనం రానివ్వడం లేదని అన్నారు.

ఎక్కడ రాహుల్ సభలు జరిగితే అక్కడ ప్రత్యర్ధులకు భారీ మెజారిటీ వస్తుందని ఫడ్నవిస్ అంటున్నారు. తమ రాష్ట్రంలో ఫలితాలు ఏక పక్షంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.మెల్లమెల్లగా ఇతర పార్టీ నేతలు కూడా కాషాయ తీర్ధాన్ని పుచ్చుకుంటున్నారు.

మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే బుధవారం బీజేపీలో చేరారు. తన పార్టీ మహారాష్ట్ర స్వాభిమాన పక్షకు బిజెపిలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజులుగా బీజేపీ నుంచి వచ్చే పిలుపు కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. రాణేకు మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఫడ్నవిస్ పని తీరు నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు రాణే చెప్పుకొన్నారు.ఇకమహారాష్ట్ర ఎన్నికలు జోరుగా సాగుతాయన్న సమాచారం.