ఐదు పైసలకే కిలో ఉల్లిపాయలు..

నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చుని ప్రజలకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లిపాయలు..తాజాగా వాటిని పండించిన రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోతుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాసిక్‌కు చెందిన సుధాకర్ అనే రైతు తను పండించిన 13 క్వింటాళ్ల ఉల్లిపాయలను విక్రయించేందుకు సాయిఖేద వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. అయితే సుధాకర్ తెచ్చిన ఉల్లిపాయలు నాణ్యత బాగా లేదనే సాకుతో వ్యాపారులు క్వింటాల్ ఉల్లికి రూ.5గా ధర నిర్ణయించి, 13 క్వింటాళ్లకు రూ.65లు ఇస్తామన్నారు.

 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్ తన పంటను తిరిగి తీసుకెళ్లిపోయాడు. వ్యాపారులు, మార్కెట్ అధికారుల వైఖరికి నిరసనగా కిలో ఉల్లిపాయలను ఐదు పైసలకే విక్రయించాడు. మార్కెట్‌లో 35 రోజుల సమ్మె వల్ల ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో సుధాకర్ లాంటి రైతులు లబోదిబోమంటున్నారు. సాగుకి పెట్టిన పెట్టుబడికి అధికారులు ఇస్తున్న ధరకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు ఉల్లిపాయలను రోడ్లపై పారబోస్తున్నారు.