ప్రజా సమస్యలపై ఇక పోరాటమే.. చంద్ర బాబు
Published on: Tue May 31, 2022 10:46AM
ప్రజా సమస్యలపై ఇక విరామం లేని పోరాటాలేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగుదేశం వ్యూహకమిటీ సమావేశంలో ఆయన జగన్ అరాచక, విధ్వంస పాలనపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం మహానాడుతో భరోసా వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒంగోలులో జరిగిన రెండు రోజుల మహానాడు ప్రజా విజయంగా అభివర్ణించిన చంద్రబాబు కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతో నే ఇది సాధ్యమైందన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఈ స్థాయిలో మహానాడు జరిగేదని...ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో జరిగిందని చంద్రబాబు అన్నారు. క్యాడర్ లో వచ్చిన జోష్, ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని తదుపరి కార్యక్రమాలు ఉండాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాలలో పర్యటిస్తానని చంద్రబాబు తలిపారు. ఇకపోతే ఇప్పటికే మొదలు పెట్టిన బాదుడే బాదుడు నిరంతరాయంగా కొనసాగించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్విట్ జగన్ సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. కొత్త ఓట్ల నమోదు, ఒట్ల తొలగింపు వంటి అంశాల్లో నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. వైసిపి పాలనలో వైఫల్యాలను చాటేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచెయ్యాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఆ మహానాడు విజయవంతం లో భాగస్వాములు అయిన నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఊహించని స్థాయిలో జనం వచ్చినా కష్టపడి ఏర్పాట్లు చేశారని...సభను విజయవంతంగా నిర్వహించారని నేతలను చంద్రబాబు అభినందించారు. అచ్చెన్నాయుడు, లోకేష్ తో సహా కింది స్థాయి వరకు పార్టీ నేతలు అంతా ఎంతో సమన్వయంతో పనిచేశారని అన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నేతల పనితీరును చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే పోలీసు శాఖ కనీస మాత్రం సహకరించలేదని నేతలు చెప్పారు. అయినా ఎక్కడా కార్యక్రమం గాడి తప్పకుండా...పార్టీ వాలంటీర్ల ద్వారానే సభను నిర్వహించామని నేతలు చెప్పారు. మహానాడును పండుగలా మార్చిన కార్యకర్తలు, అలుపెరగకుండా సేవలు చేసిన పార్టీ వాలంటీర్లకు సమావేశం లో అభినందనలు తెలిపారు. తీవ్ర ఎండలు లెక్క చెయ్యకుండా వచ్చిన లక్షల మంది కొత్త స్ఫూర్తిని నింపారని కొనియాడారు. సాధారణంగా మాహానాడు అనేది పార్టీ కార్యక్రమం అయినా.....ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు అయ్యారని నేతలు అన్నారు. మహానాడు సక్సెస్ ను పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని నేతలు వివరించారు. సాధారణంగా ఎన్నికలకు 6 నెలల ముందు ఈ స్థాయి స్పందన ఉంటుందని...అయితే రెండేళ్ల ముందు ఇంత భారీగా మహానాడు జరగడాన్ని ప్రత్యేకంగా చూడాలని నేతలు అభిప్రాయ పడ్డారు


