నాడు, నేడు, మహానాడు…

 

మరో సంవత్సరం గడిచింది. మరో మహానాడు కోలాహలం మొదలైంది. ఈసారి విశాఖ తీరం పసుపు రంగు కలయికతో మనోహరంగా మారింది. అయితే, ఇలా మహానాడు ప్రతియేటా జరిగేదే. వైజాగ్ లోనూ మహానాడు జరగటం ఇది మూడోసారి. కాని, సంవత్సరానికి ఒకసారి జరిగే టీడీపీ వార్షికోత్సవాల లాంటి మహానాడు సంబరాలు… ఊరికే మీడియాలో చూపించినట్టు ఉపన్యాసాలు, రకరకాల వంటకాలు, విందులు, వినోదాలు, ఏవో ఒకట్రెండు రాజకీయ అలజడులు మాత్రమే కాదు! మహానాడు అంటే ఇందిరా హయాంలోని ఇనుమడిస్తున్న కాంగ్రెస్ ను ఓడించి నిలిచిన ఒక పసుపు పచ్చ ఆత్మ గౌరవ పతాకానికి నిదర్శనం! తెలుగు జాతి ఆధునిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం!

 

అన్న ఎన్టీఆర్ దిల్లీ వీధుల్లో ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఆవేదన చెంది రాజేసిన నిప్పు కణం తెలుగుదేశం పార్టీ. అది ఇవాళ్ల , ఒక విధంగా జాతీయ పార్టీగా అవతరించగలిగింది. తెలంగాణలో విపక్షంగా, నవ్యాంధ్రలో పాలక పక్షంగా, రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా పక్షంగా అస్థిత్వం కొనసాగిస్తోంది. ఏ మహానాడుకైనా ఇదే అసలు సగర్వ కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, చరిత్రలో ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పై పోరుకి సై అంటూ బరిలోకి దిగాయి. అంతే త్వరగా హస్తం చరుపులకి నేలకూలిపోయాయి. కాని, ఎన్టీఆర్ భగ్గున వెలిగించిన తెలుగు దేశం ఇవాళ్టికీ దిల్లీ కాంగ్రెస్ పెద్దల అహాన్ని సవాలు చేస్తూ దూసుకుపోతుంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే రెండూ కలిసి జాతీయ కాంగ్రెస్ ను కట్టడి చేస్తే మన దగ్గర టీడీపీ ఒక్క పార్టీనే సింగిల్ హ్యాండ్ గా వందేళ్ల పార్టీని ఢీకొట్టింది!

 

సమైక్య రాష్ట్రంలో అధికారంలో వున్నా లేకపోయినా చాలా మహానాడు సంబరాలు హైద్రాబాద్ లోనే జరిగాయి. ఈ సారి అలాకాక టీడీపీ చేతిలో వున్న నవ్యాంధ్రలో… రాజధాని అమరావతిలో కాకుండా విశాఖలో జరుగుతున్నాయి. ఇలా వేరు వేరు నగరాల్లో మహానాడు ఏటేటా జరపటం పార్టీని కార్యకర్తలకి మరింత దగ్గర చేసే అవకాశం వుంటుంది. అయితే, అంతకంటే ముఖ్యంగా, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా అవతరించిన ఈ చారిత్రక సందర్భరంలో మహానాడు మేధోమథనంలో టీడీపీ నేతలు చేయాల్సిన మరో ముఖ్యమైన పని కూడా వుంది. ఆంధ్రలో తెలుగు దేశం సత్తా చాటింది. చంద్రబాబు భాషలో చెప్పాలంటే తల్లి కాంగ్రెస్ , పిల్ల కాంగ్రెస్ లను అధిగమించి అధికారం చేపట్టింది. కాని, సమస్యల్లా టీఆర్ఎస్ ఈదురు గాలికి వణికిపోతోన్న టీ టీడీపీతోనే!

 

విశాఖలో జరుగుతోన్న మహానాడుకి రెండు రైళ్లలో తెలంగాణ టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారట. అలాంటి వేలాది సైకిల్ సైనికుల కోసమైనా చంద్రబాబు టీ టీడీపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీ కాంగ్, టీఆర్ఎస్ ఆక్రమించిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని టీడీపీ మరోసారి మార్చాలి. బీజేపితో కలిసిగాని… స్వంతంగా కాని… తెలంగాణలో మరోసారి పచ్చ జెండా రెపరెపలాడించాలి. ఇది కేవలం పార్టీకి, కార్యకర్తలకి మాత్రమే కాదు జనానికి కూడా ఎంతో మేలు చేసే పరిణామం. అందుకే, ఈ మధ్య తెలంగాణ మహానాడులో బాబు చెప్పినట్టు టీ టీడీపీపై ప్రత్యేక దృష్టి పెట్టి పునాదులు నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జాతీయ పార్టీగా వెలుగొందే అవకాశం తెలుగుదేశానికి , పేరుకు తగ్గట్టుగా వుంటుంది.