కొల్లాపూర్ ఓట్లు కొల్లగొట్టేదెవరు?
Published on: Tue Mar 13, 2012 1:16PM
మ
హబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం వరకు టిఆర్ఎస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావుకు అనుకూల వాతావరణం కనిపించింది. అయితే కాంగ్రెస్ మంత్రులు ఈ పరిస్థితిని మార్చి తమ పార్టీ అభ్యర్ధి మామిళ్ళపల్లి విష్ణువర్ధనరెడ్డి విజయానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్యనే ఉండబోతోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన జూపల్లి కృష్ణారావు ప్రత్యేక తెలంగాణాకోసం కాంగ్రెస్ కు, మంత్రి పదవికి రాజీనామాచేసి టిఆర్ ఎస్ లో చేరారు. దీంతో టిఆర్ఎస్ కు చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా జూపల్లిని ఢీకొంటున్నారు. మామిళ్ళపల్లి వ్యక్తిగత సామాజికవర్గం ఓట్లతోపాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై కూడా ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు విష్ణువర్ధనరెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు రంగంలోకి దిగారు.
జూపల్లి కృష్ణారావుకు బద్ధవిరోధి అయిన మంత్రి డికె అరుణ కొల్లాపూర్ లోనే మకాంవేసి జూపల్లి ఓటమికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన విష్ణువర్ధనరెడ్డికి 23 వేల ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఆయనకు వచ్చిన ఓట్లతోపాటు కాంగ్రెస్ ఓట్లను కూడా కలుపుకుంటే ఇప్పుడు ఆయన గెలుపు ఖాయమనే అంచనాతో కాంగ్రెస్ ఉంది. అంతేకాక జూపల్లి కృష్ణారావు, టిడిపి అభ్యర్ధి సిహెచ్ జగదీశ్వరరావుకు కూడా వెలమ సామాజికవర్గానికి చెందినవారు. దీనివల్ల ఆ సామాజికవర్గ ఓట్లలో చీలిక వచ్చి వారి ఓట్లశాతం మరింత తగ్గుతుందని కాంగ్రెస్ అంచనావేస్తోంది. గత ఎన్నికల్లో జూపల్లికి 58వేల ఓట్లు పోలయితే, జగదీశ్వరరావుకు 56 వేల ఓట్లు వచ్చాయి. పార్టీలు మారిన నేపధ్యంలో ఈ ఇద్దరు అభ్యర్ధుల ఓటు బ్యాంకుకు గుండిపడటం ఖాయమని, అలా జరగడంవల్ల తమ అభ్యర్ధికి ఇబ్ది జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.


