TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాలమూరులో కారుజోరుకు స్పీడ్ బ్రేకర్ లా మారిన కమలం

Published on: Fri Mar 9, 2012 10:24AM

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ ఎస్ జోరుకు బిజెపి బ్రేకులు వేస్తోంది. నిజానికి తెలంగాణా సెంటిమెంట్ బాగావున్న ఈ నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి ఇబ్రహీం విజయం ఖాయమని అంతా భావించారు. అయితే తెలంగాణా నినాదంతోనే బరిలోకి దిగిన బిజెపి కూడా ఈ నియోజకవర్గంలో అనూహ్యంగా పుంజుకోవడంతో హఠాత్తుగా ఇక్కడ వాతావరణంలో మార్పు కనిపించింది. బిజెపి  తన బలాన్ని పెంచుకుంటున్న కొద్దీ అది తెరాస కు నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల జరిపిన తెలంగాణా యాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన కనిపించింది. తెలంగాణా ఏర్పాటు జాతీయ పార్టీ అయిన బిజెపి కే సాధ్యమని ఆయన స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగారు. బిజెపి అభ్యర్ధి యన్నం శ్రీనివాసరెడ్డి గతంలో తెరాస జిల్లా అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయనకు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, యువకులతో ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. శ్రీనివాసరెడ్డి కులస్తులు ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. అవన్నీ బిజెపి అభ్యర్ధికి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల వేళ హన్వాడ జడ్ పిటిసి మాజీ సభ్యుడు నరేందర్, తెరాస విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి తెరాసను వీడటం ఆ పార్టీకి తీరని నష్టం కలిగించింది. దీనికి తోడు పట్టణంలోని మైనార్టీ వర్గాల ఓటర్లు ఆశించిన స్థాయిలో టిఆర్ఎస్ అభ్యర్ధివైపు మొగ్గుచూపడం లేదు. బిజెపి చాపకింద నీరులా విస్తరిస్తూ తెరాస గండికొడుతుంది. ఈ పరిణామాల నేపధ్యంలో తెరాస అభ్యర్ధి విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.