మహబూబ్ నగర్ లో మైనార్టీలపైనే కాంగ్రెస్ ఆశలు
Published on: Mon Mar 12, 2012 12:45PM
మ
హబూబ్ నగర్: మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీ త్రీవంగా కృషిచేస్తోంది. అధికార బలంతో పాటు అన్నిరకాలుగా ఓటర్లను ఆకర్షించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా మంత్రి డికె అరుణ, ఇన్ ఛార్జి మంత్రి రామ్ రెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ నియోజకవర్గంలో విజయానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీనిలో భాగంగా మైనార్టీ ఓట్లపై వారు ప్రత్యేక దృష్టిపెట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సుమారు 23వేల ఓట్లు పోలయ్యాయి.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించని మైనార్టీలు ఈసారి తమకు అండగా నిలుస్తారన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీనికితోడు టిడిపి, బిజెపి కూడా ప్రధాన పోటీదారులుగా నిలవడంవల్ల వారి ఓట్లుచీలడంతో పాటు, కాంగ్రెస్ సాంప్రదాయ ఓటుబ్యాంకు మాత్రం చెక్కు చెదరదనే నమ్మకంగా మంత్రులు ఉన్నారు. టిఆర్ఎస్ మైనార్టీ అభ్యర్ధి సయ్యద్ ఇబ్రహీంవల్ల తమకు పెద్దగా నష్టం ఉండదని వారు అంచనా వేస్తున్నారు. మైనార్టీలతో పాటు తెలంగాణా సెంటిమెంట్ కాస్త బలహీనపడటం, టిడిపి, బిజెపిల మధ్య ఓట్లు చీలడం తమకు లాభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.


