TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాలమూరులో చేతులు కలుపుతున్న రెడ్లు

Published on: Tue Mar 13, 2012 11:47AM

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు శాసనసభ స్థానంలో ఒక్కసారి తప్ప ఎప్పుడూ బిసి అభ్యర్ధులే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో రెడ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఒక్కరు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.2009లో జరిగిన ఎన్నికల్లో రాజేశ్వరరెడ్డి ఇక్కడ గెలుపొందడంతో ఈ నియోజకవర్గంలోని రెడ్డి కులస్తులు ఆనందపడ్డారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. రాజశ్వేరరెడ్డి హఠాత్తుగా మరణించారు. ఆ స్థానంలో ఆయన కుటుంబీకులకు వారసులుగా నిలబెడదామంటే ఆయనకు వారసులు కూడా లేరు.

 

ఈ పరిస్థితిని గమనించిన బిజెపి పాలమూరులో పాగా వేయడానికి ప్రయత్నించింది. ఆ పార్టీ ఏరికోరి రెడ్డి కులానికి చెందిన వై. శ్రీనివాసరెడ్డిని తమ అభ్యర్ధిగా రంగంలో దింపింది. పార్టీ ఏదైనా ఇష్టమున్నా లేకపోయినా రంగంలో ఉన్న వ్యక్తి రెడ్డి కాబట్టి అతనికి మద్దతు ఇవ్వాలంటూ అన్ని పార్టీల్లోని రెడ్డికులస్తులు చేతులు కలుపుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ ల్లో ఉన్న కొందరు రెడ్డి నాయకులు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నారు. ఈ పరిణామాలు బిజెపికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దీనికితోడు పాలమూరులో పోటీచేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్ధి మైనార్టీ వర్గానికి చెందినవాడు. దీంతో ఈ నియోజకవర్గంలోని హిందువులు తమ పార్టీవైపు మొగ్గుచూపుతారని బిజెపి భావిస్తోంది. ఇదే జరిగితే పాలమూరులో బిజెపి అభ్యర్ధి తన ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇస్తాడనటంలో సందేహం లేదు.