సంక్షోభంలో మహా సంకీర్ణం.. సంజయ్ రౌత్‌పై ఈడీ నజర్..
Published on: Wed Apr 6, 2022 11:26AM
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల కూటమి మహావికాస్ అగాధి సర్కార్’ అధికార పగ్గాలు చేపట్టి ఇంచు మించుగా రెండున్నర సంవత్సరాలు కావస్తోంది. ఆది నుంచి సంకీర్ణంలో లుకలుకలున్నా,ఇంతవరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సాఫీగానే సాగుతోంది. అయితే, ఇప్పుడు ఓ వంక కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. శివసేన కాంగ్రెస్ పార్టీల మధ్య యూపీఏ నాయకత్వం విషయంగా దూరం పెరిగింది. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యాన్మాయం కాలేదని, యూపీఏ నాయకత్వం నుంచి కాంగ్రెస్ తప్పుకుని మరొకరికి పగ్గాలు అప్పగించాలని, శివసేన అధికార పత్రిక సామ్నా’ ప్రచురించి సంపాదకీయ కథనంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. శివసేన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీనే కాదు, మహావికాస్ అగాధి మరో కీలక భాగస్వామ్య పార్టీ అధినేత శరద్ పవార్, కూడా తిరస్కరించారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. మరో వంక కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు శివసేనతో తెగతెంపులు చేసుకోవాలని కోరుతూ, కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సో ... మహావికాస్ అగాధిలో ఒక విధంగా శివసేన ఒంటరి అయింది.
మరో వంక ఉద్ధవ్ థాకరే సోదరుడు, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే శివసేన హిందుత్వాన్ని సవాలు చేస్తున్నారు. మసీదులఫై స్పీకర్’లను తొలిగించాలని లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసా వినిపిస్తామని సవాలు విసిరారు. మరో వంక రాజ్ థాకరే బీజేపీకే దగ్గరవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలా నాలుగు దిక్కుల నుంచి సమస్యలు ఎదురవుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఇదలా ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మాజీ మిత్ర పక్షం శివసేన మీద దండ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఐటీ, ఈడీని రంగంలోకి దింపింది. కొద్ది రోజుల క్రితం వేల కోట్ల విలువైన పత్రా చాల్ భూకుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్ మాధవ్ ఆస్తులనూ జప్తు చేసిన ఈడీ, ఇప్పుడు తాజాగా అదే కేసులో శివసేన మరో కీలక నేతపై వల విసిరింది. శివసేనలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తర్వాత నంబర్ 2గా ఉన్న రాజ్యసభ ఎంపీ, పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాకిచ్చింది. సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ‘రూ.1, 034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మీడియాకు సమాచారం అందజేసింది.శివసేన,ఎన్సీపీ నేతల్ని ఒక్కరుగా టార్గెట్ చేస్తూ వస్తోన్న కేంద్ర నిఖా సంస్థలు.. ఇప్పుడు ఏకంగా శిసేనకు కుడిభుజంలాంటి సంజయ్ రౌత్ పై తీవ్ర చర్యలకు సిద్దమవుతోంది.
అలాగే, ఇప్పటికే అరడజను మందికి పైగా, శివసేన, ఎన్సీపీ కీలక నేతల మెడకు ఉచ్చు బిగించిన ఈడీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత దూకుడు పెంచింది. కేంద్ర విచారణ సంస్థలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రత్యర్థులపై ప్రతీకారానికి వాడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తీవ్రంగా విరుచుకు పడ్డారు. అయినా, కేంద్రం మాత్రం విపక్షాల విమర్శలను పట్టించుకోవడం లేదు. విచారణ సంస్థలు తమ పని చేసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మహావికాస్ అగాధి ప్రభుత్వం మనుగడ, అదే విధంగా ముఖ్యమత్రి ఉద్ధవ్ థాకరే, శివసేన భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అయితే, మహావికాస్ అగాధి కూటమి ఇరుసుగా శరద్ పవార్ ఉన్నంత వరకు సర్కార్ మనుగడకు ముప్పు లేదని అంటున్నారు.


