అదే జోరు.. అదే హోరు.. 15వ రోజు ‘మహాపాదయాత్ర’
Published on: Mon Nov 15, 2021 10:26AM
అమరావతే ఏపీకి ఏకైక రాజధాని. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. సీఆర్డీఏ రద్దు చేయాలి. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమం ఆపేది లేదంటూ రాజధాని రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రెండేళ్లుగా తగ్గేదే లేదంటున్నారు. ధర్నాలు, దీక్షాలతో అమరావతి నినాదం వినిపించారు. లాఠీ దెబ్బలను ఓర్చుకుంటూ జై అమరావతి అంటున్నారు. అయినా, జగన్ సర్కారు మనసు మారకపోవడంతో.. తమ గోడును ఆ దేవదేవుడికే చెప్పుకునేందుకు.. జగన్‌రెడ్డి బుద్ధి మార్చాలని వేడుకునేందుకు.. దండు కట్టారు అమరావతి రైతులు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ.. అంటూ మహా పాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర తొమ్మిదో రోజు ప్రకాశం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది.
ఇవాళ జరుగుమల్లి మండలంలో మొదలైన యాత్ర సుమారు 14కి.మీ మేర సాగి కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగియనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. పోలీస్ నిర్బంధనలు ఎదుర్కొంటూ పాదయాత్రకి సంఘీభావం చెబుతున్నారు స్థానికులు.
అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.


