మాగుంట పార్వతమ్మ కన్నుమూత!
Published on: Wed Sep 25, 2024 12:17PM

తెలుగుదేశం నాయకుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కావలి ఎమ్మెల్యేగా కూడా పని చేసిన మాగుంట పార్వతమ్మ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, మాగుంట పార్వతమ్మ మృతి బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనీ, దశాబ్ధాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ వస్తోందన్నారు. పార్వతమ్మ మృతి ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


