ఆలనా పాలనా కరవైన అపురూప ఆలయం!
Published on: Mon Jun 8, 2026 11:14AM
.webp)
వరంగల్ జిల్లా, నల్లవెల్లి మండలం, శనిగరం శివారులో ఏడు శతాబ్దాల నాటి కాకతీయ శివాలయం నేడో రేపు కూలటానికి సిద్ధంగా ఉందనీ, ఆ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ చరిత్రకారుడు డాక్టర్ రాచర్ల గణపతి ద్వారా అందిన సమాచారం మేరకు ఆయన ఆదివారం (జూన్ 7) అపురూప ఆలయాన్ని సందర్శించారు.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ ఆలయాన్ని డిజిటల్ డాక్యుమెంటేషన్ చేయటానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని, టార్చ్ సంస్థ కార్యదర్శి, వారసత్వ కార్యకర్త, అరవింద్ ఆర్య తెలిపారని శివనాగిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా పరిసర పొలాల్లో ఉన్న రైతులకు ఆలయ చారిత్రక ప్రాధాన్యతను వివరించి, పెరిగిన ముల్లకంపలు, పొదలు, చెట్లు తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


