TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు

Published on: Sun Jun 8, 2025 8:30AM

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు.   కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ   తుదిశ్వాస విడిచారు. 

ఈ నెల 5వ తేదీన గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో  కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను  ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్‌ అయినట్టు గుర్తించి సీపీఆర్ నిర్వహించారు. అనంతరం ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి నాడి, రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.   గోపీనాథ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆస్పత్రిలో   డయాలసిస్ జరిగింది.  

  మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి   తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా   మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే 1982లో ఆరంభమైంది. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడి పని చసిన ఆయన  2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  2018లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి రెండోసారి విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.  2022లో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా  బాధ్యతలు నిర్వర్తించారు.