గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు బ్రేక్

గోవధను నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా హిందుత్వ సంస్థలు, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో దీనిని నిషేధించే దిశగా కేంద్రం అడుగులు ముందుకేస్తోంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి పలు ఆంక్షలు విధించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, పశ్చిమబెంగాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పలువురు ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం గోవధ నిషేధంపై స్టే విధించింది. ఈ స్టే నాలుగు వారాల పాటు ఉంటుందని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. ఈ లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.