బందరులో సాల్ట్ స్కామ్
Published on: Tue Feb 14, 2012 2:23PM
మచిలీపట్నం: మచిలీపట్నం మండ
లం కోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం సముద్రతీర గ్రామాల్లో సుమారు 7 వేల ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న భారత సాల్ట్ రిఫైనరీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ భారీ స్కాంకు పాల్పడింది. దేశ ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారనే కారణంతో అయోడిన్ సాల్ట్ తయారీకి ఈ సంస్థకు ప్రభుత్వం 7వేల ఎకరాల భూమిని లీజుకు ఇచ్చింది. ఈ సంస్థ ఎకరానికి సంవత్సరానికి రూ.50మాత్రమే లీజు చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం భారత సాల్ట్ రిఫైనరీ ఇక్కడ అయోడిన్ సాల్ట్ మాత్రమే తయారుచేసి విక్రయించాలి. అయితే ఈ నిబంధనను భారత సాల్ట్ రిఫైనరీ తుంగలో తొక్కి ప్రజలకు ఉపయోగపడాల్సిన అయోడిన్ కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే ఉప్పును తయారుచేస్తుంది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్దమని అధికారులకు, స్థానిక నాయకులకు తెలిసినప్పటికీ వారెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు రాజకీయ నాయకులను లంచాలతో కట్టిపడేసిన ఈ సంస్థ వేలాది ఎకరాల భూమిలో ఉప్పును పండిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. సీబీఐ లాంటి సంస్థతో ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.


