ప్రేయసి అలక.. సిటీ అంతా సారీ హోర్డింగ్స్.. ట్విస్ట్ అదుర్స్

లవర్స్ మధ్య చిన్నచిన్న గొడవలు కామన్.. లవర్ అలిగితే కన్నా, బుజ్జి, బంగారం అంటూ బ్రతిమాలుకొని సారీ చెప్పి తిరిగి మాట్లాడేవాళ్ళని చూసి ఉంటారు.. మరి సినిమాల ప్రభావమో ఏంటో తెలీదు కానీ ఒకతను తన లవర్ అలిగితే చాలా వినూత్నంగా సారీ చెప్పాడు.

 

 

ఇంతకీ మేటర్ ఏంటంటే.. పుణెలోని పంప్రి చించ్వాడ్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నీలేశ్‌ ఖేడేకర్‌.. అతనికి లవర్ ఉంది.. మరి లవర్ ఉంటే గొడవలు ఉండటం కామనే కదా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.. ఇంకేముంది అతని లవర్ అలకబూనింది.. కన్నా, బుజ్జి అని ఏం బ్రతిమాలతాంలే అనుకున్నాడో? లేక వ్యాపారవేత్త కదా కొంచెం కొత్తగా ఆలోచించాలి అనుకున్నాడో తెలీదు కానీ మనోడికి ఓ ఐడియా వచ్చింది.. లవర్ వెళ్లే దారిలో 'ఐ యామ్‌ సారీ' అంటూ సుమారు 300 హోర్డింగ్స్ ఏర్పాటు చేసాడు.. ఆ అమ్మాయి అలకవీడి నీలేశ్‌ తో మాట్లాడటం ఏమో కానీ, అదిరిపోయే ట్విస్ట్ ఎదురైంది.. అనుమతి లేకుండా ఈ హోర్డింగులు పెట్టాడని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నీలేశ్‌ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.. మరోవైపు అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసారు.. పాపం మరి మనోడి హోర్డింగ్ ప్రేమకు ఆ అమ్మాయి మనస్సు కరిగిందో లేదో తెలీదు కానీ పోలీస్ కేసు మాత్రం నమోదైంది.