కృష్ణుడు కలలోకి వస్తాడు.. అప్పుడు జగన్.. ఇప్పుడు అఖిలేశ్..
Published on: Tue Jan 4, 2022 11:33AM
తెలుసుగా. జగన్‌రెడ్డి రాత్రిళ్లు తన తండ్రి వైఎస్సార్‌తో మాట్లాడుతుంటారని. తరుచూ కలలో జీసస్‌తోనూ చర్చిస్తుంటారని. ఈ విషయం స్వయంగా జగనే ఆయన సన్నిహితులతో చెప్పారని అప్పట్లో ఓ ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది. అప్పటి నుంచీ జగన్.. అర్థరాత్రి వైఎస్సార్‌తో, జీసస్‌తో చర్చలు జరుపుతారంటూ.. అది నిజమేనంటూ అంతా అంటుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలు జగన్‌లాంటి వారే కాదు.. దేశంలో మరికొందరు ప్రముఖులు సైతం చేస్తుంటారని అనిపిస్తోంది. లేటెస్ట్‌గా ఏపీ సీఎం జగన్ లానే.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా అలాంటి వెరైటీ వ్యాఖ్యలే చేయడం ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
"శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతీ రాత్రి నాకు కలలోకి వస్తాడు. రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతుంటారు" అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే, జగన్ తన అంతరంగికులకు మాత్రమే ఈ సీక్రెట్ చెప్పగా.. అఖిలేష్ యాదవ్ మాత్రం ఏకంగా బహిరంగ వేదికపైనే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేయడం ఆసక్తికరం.
బీజేపీకి చెందిన శాసనసభ్యుడు మాధురివర్మ ఎస్పీలో చేరిన సందర్భంగా అఖిలేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. "రామరాజ్యానికి సామ్యవాదమే (సమాజ్‌వాద్) మార్గం. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుంది" అని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్నిటా విఫలమయిందన్నారు అఖిలేష్‌యాదవ్. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.


