రెజ్లర్‌పై మర్డర్ కేసు.. సుశీల్‌పై లుక్అవుట్ నోటీసులు
Published on: Mon May 10, 2021 6:16PM
రెండుసార్లు ఒలంపిక్ మెడలిస్ట్. ఓసారి ప్రపంచ ఛాంపియన్. అనేక జాతీయ స్థాయి పతకాలు, అవార్డులు, రివార్డులు. ఇలాంటి ఘనకీర్తులతో పాటు ఇప్పుడు ఆయన ఖాతాలో ఓ మర్డర్ కేసు, పోలీసుల లుక్అవుట్ నోటీసులు కూడా చేరాయి. ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఓ మర్డర్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ.. చిక్కడు-దొరకడు టైప్‌లో తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో, తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.
ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్ దంకర్ అనే జాతీయ స్థాయి రెజ్లర్ మరణించాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్, అమిత్‌కుమార్‌లపై.. సుశీల్ కుమార్‌తో పాటు అతని ఫ్రెండ్స్ కలిసి దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. ఆ అటాక్‌లో తీవ్రగాయాలతో రెజ్లర్ సాగర్ చనిపోయాడు. తమపై దాడికి పాల్పడింది సుశీల్, అతడి మిత్రులే అని గాయపడిన ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాడి జరిగినప్పటి నుంచి సుశీల్ తప్పించుకొని తిరుగుతుండటంతో పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి.
దాడి జరిగినప్పుడు రెజ్లర్ సుశీల్ కుమార్ స్టేడియంలోనే ఉన్నాడని అనేందుకు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు పోలీసులు. అతడిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో వెతుకుతున్నారు. తొలుత హరిద్వార్‌లో అతడు ఉన్నట్టు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లే సరికి అతను అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఆ తర్వాత రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు అతడు ప్రతిసారీ తన చోటును మారుస్తున్నాడని పోలీసులు అంటున్నారు. అందుకే, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పట్టుకునేందుకు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హత్య కేసులో అతని పాత్ర ఉందని తేలితే.. ఇక సుశీల్ కుమార్ రెజ్లింగ్ కెరీర్ ముగిసినట్టే.


