TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుదూర భూతల దాడి క్రూయిజ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

Published on: Tue Jun 16, 2026 11:03AM

భారత రక్షణ పరిశోధన,  అభివృద్ధి సంస్థ  డీఆర్‌డీఓ పూర్తిగా  స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం)ని సోమవారం (జూన్ 15) ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తిగా ఛేదించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది.

చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన వివిధ ట్రాకింగ్ పరికరాలు సేకరించిన సమాచారంలో క్షిపణి నిర్దేశిత పనితీరు   నిర్ధారణ అయింది. ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది. ఇందులో ఉపయోగించిన అన్ని ఉపవ్యవస్థలను డీఆర్‌డీఓకు చెందిన పలు ప్రయోగశాలలు, ఇండియన్ ఇండస్ట్రియల్ భాగస్వాములు రూపొందించారు.  ఈ ప్రాజెక్టుకు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) ప్రధాన ప్రయోగశాలగా వ్యవహరించింది.

క్షిపణి ప్రయోగాన్ని డీఆర్‌డీఓ సీనియర్ అధికారులు, భారత నౌకాదళం,  వైమానిక దళానికి చెందిన ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ  ప్రయోగంవిజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,  డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు.  ఈ ప్రయోగం విజయవంతం కావడంతో  ఇండియా స్వదేశీ క్షిపణి సాంకేతికతలో మరో కీలక మైలురాయిని అధిగమించినట్లు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.