TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోటీశ్వరుడి ఏకాంత వాసం

Published on: Wed Jun 22, 2022 7:03AM

పెద్ద వుద్యోగాలు లేదా పెద్ద వ్యాపారాలు లేదా ప‌రిశ్ర‌మ‌లు క‌లిగిన‌వారు అంతే హుందాగా, జీవిత‌మంతా ఉన్న‌త స్థాయిలో ఎలాంటి క‌ష్ట‌ న‌ష్టాలూ లేకుండా   జీవించాల‌నే అనుకుంటారు. వారికి క‌ష్టాలు, స‌మ‌స్య‌ల గురించి విన‌డం, చూడ‌టం బొత్తిగా యిష్టం వుండ‌దు. కానీ కోటీశ్వ‌రుడైన డేవిడ్ గ్లాష‌న్ అందుకు పూర్తి విరుద్ధం. అవును. ఆయ‌న స్టాక్‌ బ్రోక‌ర్‌, కోటీశ్వ‌రుడు. ఎంతో బ్ర‌హ్మాండ‌మైన విల్లాలో అత్యంత ఆధునిక సాంకేతిక సౌక‌ర్యాల‌తో జీవిస్తుండేవాడు. కానీ హ‌ఠాత్తుగా త‌న యావ‌త్ ఆస్తిని, విల్లాని, భోగ‌భాగ్యాల జీవితాన్ని కాద‌నుకుని స‌ర్వ‌సంగ ప‌రిత్యాగిలా వేరే దీవి ప్రాంతానికి వెళ్లి ఒక్క‌డే ఒంట‌రిగా బ‌కుతున్నాడు.  ఇలాంటి వారిని గురించి పూర్వం రుషుల క‌ధ‌ల్లో విని వుంటాం.

కొంద‌రు రాజులు రాజ్యాన్ని రాజ్య కాంక్ష‌ను వ‌దిలేసి వానప్రస్థానానికి వెళిపోయార‌ని చదువుకున్నాం. ఈ ఆధునిక ప‌రిత్యాగి ఈ మ‌ధ్య వ‌ర‌కూ బాగానే వున్నాడు. కానీ వ‌య‌సు మ‌ళ్లింది 78 ఏళ్ల‌వాడ‌య్యాడు. ఇపుడు అత‌నికి క‌నీసం మాట్లాడేందుకు ఒక స్నేహితుడు వుంటే బాగుండున‌ని తెగ బాధప‌డుతున్నాడు. విచిత్రం క‌దూ!
గ్లాషీన్ 1997 నుంచి ఉత్త‌ర క్వీన్స్‌లాండ్ తీరాని స‌మీపంలో వున్న కేప్ యార్క్ పెనిన్స్య‌లా రెస్టోరేష‌న్ ఐలాండ్‌లో ఒక్క‌డే వుంటున్నాడు. ఆయ‌న‌తో పాటు  మిరాండా, ఫిలిస్ అనే రెండు కుక్క‌లు మాత్రం వున్నాయి. క‌నీసం ఫోన్ కూడా లేదు. ఆ ఇబ్బంది ఆయ‌న‌కు ఈమ‌ధ్య తెలిసింది. ఎలాగంటే ఈమ‌ధ్య ఒక‌ రోజు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడ‌ట‌. ఆయ‌న తుంటి భాగం దెబ్బ తిన్న‌ద‌ట‌! కానీ ఆ స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అయ్యో ఎవ‌ర‌న్నా వుంటే బాగుండేద‌ని అనిపించింది. 
ఆయ‌న ఆస్తి చాలా మటుకు 1987 లో స్టాక్ మార్కెట్ దెబ్బ‌తిన‌డంతో కోల్పోయాడు. ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు భార్య‌కు విడాకులు ఇచ్చాడు. ఆమె దూరంగా వెళ్లి ప్ర‌శాంతంగా వుంటుంద‌ని.

ఆయ‌న 1997లో రెస్టో ఐలెండ్ కి వ‌చ్చేడు.  అప్ప‌టినుంచీ ఎంతో ఆనందంగా, మ‌రెంతో ఆరోగ్యంగా వుంటున్నాడు. మ‌రో మాట‌.. ప్ర‌పంచ‌మంతా కోవిడ్‌తో ఎంతో ఇబ్బంది ప‌డుతున్న‌స‌మ‌యంలో కూడా ఆయ‌న ఎంతో ఆరోగ్యంగా వున్నాడ‌ట‌. ఆయ‌న‌కు అస‌లు కోవిడ్ సంగ‌తే తెలియ‌నంత‌గా సుఖంగా వున్నాడు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత త‌న ప‌ట్ట‌ణానికి తిరిగి ఆ మ‌ధ్య ఒక్క‌సారి వెళ్లారు. త‌క్కువ రోజులే వున్నారు. తిరిగి వెళ్లేట‌పుడు రెండు నిక్క‌ర్లు, మూడు చొక్కాలు, పుస్త‌కాలు, టూత్‌పేస్ట్‌, బ్రెష్‌, చిల్లీ పౌడ‌ర్ డ‌బ్బా మాత్ర‌మే తీసికెళ్లార‌ట‌! ఇపుడు ఆయ‌న‌కు సోలార్ ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం కూడా ఏర్పాట‌యింద‌ట‌. 

దాహ‌మేస్తే అక్క‌డి కొండ ప్రాంతాల్లో నిల‌వ వున్న నీటి కుంట నుంచి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నారు. ఆ నీళ్లు ఎంతో బావున్నాయంటున్నాడు, మంచి ప్రోటీన్ల‌తో క‌లిసి వున్న నీళ్ల‌ట‌! మెల్ల‌గా ఆయ‌న సొంతంగా చేప‌లు ప‌ట్టే వ‌ల త‌యారుచేస‌కున్నారు. నిప్పు రాజేసే కోసు రాయి త‌యారు చేసుకున్నారు. ఒక బాకు కూడా వుందిట‌! కొబ్బ‌రి, చెర్రీలు, అక్క‌డ ల‌భించే ర‌క ర‌కాల ప‌ళ్లు తింటూ  హాయిగా బ‌తికేస్తున్నారాయ‌న‌. అన్న‌ట్టు ప‌డ‌వ కూడా వుంది. అందులోనే ప్ర‌యాణిస్తూంటాడు. 

కాబోతే వ‌య‌సు రీత్యా పెద్ద‌వార‌య్యే స‌రికి మాట్లాడుకునేందుకు తోడు అవ‌స‌ర‌మ‌నిపించి ఎవ‌ర‌యినా యాభ‌య్యేళ్లు మించ‌ని వారిని  త‌న‌కు స‌హాయ‌కులుగా పెట్టుకుందామ‌ని ఆలోచ‌న‌లో వున్నారు. జీతం కాకున్నా ఎంతో కొంత ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మేన‌ట‌!  క‌థ‌లు, సినిమాల్లో త‌ప్ప ఇలా స‌ర్వస్వం వ‌దులుకుని ఒంట‌రిగా ఇన్నేళ్లుగా జీవించ‌డం గురించి విన్నారా?