మోడీ గారు ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు...

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత గుర్తుంది కదా.. అలా ఉంది ఇప్పుడు ప్రధాని మోడీ చేసింది. కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు గత మూడు రోజులుగా పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా ప్లకార్డులు పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ.. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయినా కూడా ఎంపీలు మాత్రం ఏమాత్రం కూడా వెనక్కితగ్గకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రసంగంలో ముఖ్యంగా మోడీ కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు.

 

ఒకపక్క ఏపీ ఎంపీలు ఆందోళనలు చేస్తుంటే.. దానికి సమాధానం చెప్పకుండా.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని.. అన్నారు. అప్పుడు వారు చేసిన తప్పుల వల్లనే ఈనాడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదని మండిపడ్డారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అవమానించారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యను, పీవి నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చేసిన రాజకీయ అరాచకాలు అనేకం. అలాంటివారా ఆ రాష్ట్రం గురించి మాట్లాడేది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రసంగం మధ్యలో మోదీ.. ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికోసమే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని.. ప్రజలు ఆయనకు పట్టంగట్టారని అన్నారు.

 

ఇక ఇంత చెప్పిన మోడీ తాను ఏపీకి ఏం చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేదు. విభజన చట్టంలోని హామీల ఊసే ఎత్తలేదు. విభజన పాపం కాంగ్రెస్ దే అని...ఏపీకి ఎలాంటి హామీ ఇవ్వకుండానే చేతులు దులిపేసుకున్నారు. అయితే ఇక్కడ మోడీ గారు అర్దం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే... కాంగ్రెస్ చేసిన పాపానికి  వారికి తగిన బుద్ది చెప్పడం అయిపోయింది. ఏదో రాజకీయ ప్రయోజనం కోసం.. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్. రాష్ట్రం విడగొట్టినందుకు ఏపీలో మట్టికొట్టుకుపోయింది. పోనీ రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణలో అయినా కాంగ్రెస్ ను ఆదరించారా అంటే అదీ లేదు. ఈ ఒక్క పాపానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకోవడం చాలా కష్టం.. తెలంగాణలో ఏమో కానీ.. ఏపీలో అయితే కాంగ్రెస్ ను ఎట్టిపరిస్థితిలో క్షమించరు. మరి ఈ విషయం మోడీ గారు మరిచిపోయారేమో...? కాంగ్రెస్ పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉంది. మోడీ గారు ఇలానే చేస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో ఏపికి అన్యాయం గురించి మాట్లాడుతూ....ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మ గౌరవం అంటూ, నాలుగు ఎమోషనల్ డైలాగ్స్ చెబితే సరిపోదు కదా..జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలి కదా. ప్రస్తుతం పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన తప్పులను ఎలా సరిదిద్దుతుందో, ఏపీకి ఏ విధంగా న్యాయం చేస్తుందో మాత్రం చెప్పలేదు. ఎలాగూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి దానికి ఆయనేం చేస్తారో మాత్రం సెలవివ్వలేదు. ఇలానే మాటలతో సరిపెడితే రాష్ట్రంలో పార్టీకి అదోగతే. మోడీ గారు ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారో పాపం...