టీడీపీ ఎంపీపై సస్పెన్షన్ వేటు

 

తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్‌ను లోక్‌సభ నుంచి రెండు రోజుల పాటు లోక్‌సభ స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపినందుకు రూల్‌ నెం.254(ఎ) ప్రకారం రెండురోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. అంతకుముందు  పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళన చేశారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్‌ వేషధారణలో శివప్రసాద్‌ నిరసన తెలిపారు. కాగా తెదేపా ఎంపీల నిరసనపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి దిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నిరసన తెలుపుతున్న ఎంపీల వద్దకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ చేరుకుని మీడియాను పిలిపించి మాట్లాడారు. 

ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తెలుగు దేశం పార్టీ ఆనందంగా అంగీకరించిందని, ఆ తర్వాత మాట మార్చిందని గోయల్‌ విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చేందుకే ఆందోళన పేరిట తెదేపా.. ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. తెలంగాణలో తెదేపాను ప్రజలు తిరస్కరించారని, ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారన్నారు. గోయల్‌ మాట్లాడుతుండగా తెదేపా ఎంపీలు జోక్యం చేసుకుని మీ మంత్రిత్వ శాఖ నుంచి ఏం చేశారో చెప్పాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ప్యాకేజీపై కాకుండా రైల్వే జోన్‌ గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని గోయల్‌ చెప్పుకొచ్చారు.