రాహుల్ నాన్సెన్స్ అంటే...

 

రాహుల్ గాంధీ ‘నాన్సెన్స్’ అని ఒకమారు అంటే ప్రభుత్వామోదం పొందిన ఆర్డినెన్స్ కూడా చెత్త బుట్టలోకి వెళ్ళిపోతుంది. అదే ఆయన ‘ఓకే’ అంటే రెండేళ్ళ క్రితం అటక మీద పడేసిన లోక్ పాల్ బిల్లు కూడా దుమ్ము దులుపుకొని ఉభయసభలలో రేసుగుర్రంలా పరుగులు తీసి ఆమోదం పొందేస్తుంది. సమాజ్ వాదీ పార్టీ తప్ప పార్లమెంటులో అన్నిపార్టీలు లోక్ పాల్ బిల్లుని ఆమోదించడంతో బహుశః ఈరోజు రాజ్యసభ సమావేశాలు ముగిసేలోగానే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందవచ్చును. అయితే, రాహుల్ గాంధీ ఎంతో ముచ్చట పడుతున్నమతనిరోధక బిల్లుకి మాత్రం బీజేపీ కాలు అడ్డం పెడుతోంది. అందువల్ల దానికోసం కాంగ్రెస్ పెద్దలు మరికొంత కసరత్తు చేయవలసి ఉంటుంది.

 

నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయి నిరాశలో కూరుకుపోయిన మన రాహుల్ బాబు కనీసం లోక్ పాల్ బిల్లు దేశానికి మంజూరు చేసి కాస్త డప్పేసుకొందామని అనుకొంటే, ఎవరో అరవింద్ కేజ్రీవాల్ అనే ఆమాద్మీ అట, దానిని ఒక జోక్ పాల్ బిల్లు అని కుళ్ళు జోకులేస్తున్నాడు. పోనీ లోక్ పాల్ బిల్లు కోసం కడుపు మాడ్చుకొంటున్నఆ పెద్దాయన-అన్నా హజారే అయినా సంతృప్తిగా ఉన్నారంటే ఆయన కూడా ఎందుకో బరువుగా నిట్టూర్పులు విడుస్తున్నారు తప్ప ఈ బిల్లుని గురించి ఒక్క ముక్క మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

 

అయితే ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా లోక్ పాల్ బిల్లు మన రాహుల్ బాబుకి బాగా నచ్చింది. గనుక ఇక పార్లమెంటు ఆమోదం పొందవలసిందే. రేపటి నుండి దాని గొప్పదనం గురించి, అటువంటి గొప్ప బిల్లును అటక మీద నుండి దింపించి, పార్లమెంటు చేత ఆమోదింపజేసిన ఘానాపాటి రాహుల్ గాంధీ గొప్పదనం, పట్టుదల, ప్రజల పట్ల నిబద్దత గురించి కాంగ్రెస్ భజన సంఘాలు హోరెత్తించేస్తుంటే జనాల చెవులు చిల్లులు పడిపోవలసిందే.