ఇక పార్టీలో లోకేష్ క్రియాశీలకం ?

 

 

తెలుగు దేశం పార్టీ అధినేత తనయుడు నారా లోకేష్ ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల సమయంలో పార్టీ మానిఫెస్టో రూపకల్పనలోనూ, ప్రచార కార్యక్రమాల వెనుక ఆయన పాత్ర ఉంది.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ నేత జగన్ మోహన్ రెడ్డి కి బెయిల్ వస్తుందని అంటున్నారే తప్ప, ఆయన నిర్దోషిగా వస్తాడని మాత్రం ఎందుకు అనడం లేదంటూ లోకేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారు కూడా. జగన్ అవినీతిని విభిన్నంగా చెప్పాలని, వంద నోట్లను వెయ్యి లారీల నిండా నింపితే ఎంత మొత్తం అవుతుందో అంత మొత్తాన్ని జగన్ దోచుకున్నాడని చెప్పాలంటూ పార్టీ నేతలకు ప్రత్యేకంగా చెప్పారు.

 

క్రమంగా పార్టీ నేతలతో సంభందాలు పెంచుకోవడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల తన తండ్రి వెంట పాద యాత్రలో కొన్ని రోజుల పాటు నడిచారు కూడా. ఇవన్నీ పార్టీలో లోకేష్ క్రియా శీలక పాత్రకు నాందిగా భావిస్తున్నారు. అంతే కాకుండా, తన తండ్రి పాద యాత్ర ముగిసిన వెంటనే, రాష్ట్రమంతా సైకిల్ యాత్ర చేయాలని ఆయన పధక రచన చేస్తున్నట్లు సమాచారం.