ఏకతాటిపైకి అన్నగారి కుటుంబం

 

 

ఏకతాటిపైకి అన్నగారి కుటుంబం: ఫలిస్తున్న లోకేష్ ప్రయత్నాలు

 

తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్న నారా లోకేష్ ఇప్పుడు అన్న నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల మధ్య వున్న కమ్యూనికేషన్ గ్యాప్‌ని తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. స్వల్ప భేదాభిప్రాయాల కారణంగా ఎడమొహం పెడమొహంగా వున్న అన్నగారి కుటుంబాన్ని ఒక్కతాటి మీద నడిపే కృషికి శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.

 

ఈ ప్రయత్నాలను గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఇప్పుడు చంద్రబాబు అనుమతితో లోకేష్ అన్నగారి కుటుంబాన్ని కలిపే బాధ్యతను తన భుజస్కందాల మీదకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వున్నట్టు బయటకి తెలియడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని లోకేష్ భావిస్తున్నారు. అందుకే అన్నగారి కుటుంబం మొత్తం కలిసే వుందని, తెలుగుదేశం పార్టీకి అండగా వుందని సంకేతాలు పంపడం ద్వారా అన్న నందమూరి అభిమానులను, తెలుగుదేశం కార్యకర్తలను మరింత ఉత్సాహపరచవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం ఎదుర్కొంటున్న విభజన గందరగోళం నుంచి రాష్ట్రం బయటపడేలోపు అన్నగారి కుటుంబాన్ని ఒక్కటి చేసే ప్రాజెక్టును లోకేష్ చేపట్టినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  లోకేష్ తన ప్రయత్నాల్లో భాగంగా తన పెదమామ నందమూరి హరికృష్ణను కలసి చర్చించారని, వారిద్దరి మధ్య కుటుంబానికి, పార్టీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. హరికృష్ణకు సన్నిహితుడైన కొడాలి నాని తెలుగుదేశాన్ని వదిలివెళ్ళడం, ఆ తర్వాత తన ఫ్లెక్సీల్లో అన్న నందమూరి ఫొటో ఉపయోగించిన సందర్భంగా తలెత్తిన వివాదం గురించి లోకేష్ దగ్గర హరికృష్ణ ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే చంద్రబాబు కనీసం పిలిచి మాట్లాడలేదని అన్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీకి దూరంగా పెడుతున్నారని హరికృష్ణ బాధపడ్డట్టు తెలిసింది.



ఈ సందర్భంగా హరికృష్ణ ఆవేశంగా మాట్లాడితే, హరికృష్ణని లోకేష్ సముదాయించి, ఇలాంటి చిన్నచిన్న విషయాలను మరచిపోదాం మామయ్యా అని అన్నట్టు, దానికి హరికృష్ణ సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హరికృష్ణతో లోకేష్ మరోమారు సమావేశమయ్యే అవకాశాలున్నాయట. ఆ తర్వాత తన మామ బాలకృష్ణ-పెద మేనమామ హరికృష్ణలతో మీటింగ్ ఏర్పాటు చేసి, ఇద్దరి చేయీ చేయీ కలిపే అవకాశం వుందంటున్నారు. ఇదే జరిగితే హరికృష్ణ, ఆయన కుమారులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.



అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి మనసువిప్పి మాట్లాడే ఉద్దేశంలో లోకేష్ వున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి, తనకు మధ్య విభేదాలు వున్నాయని గిట్టనివారు సృష్టిస్తున్న వార్తలు నిజంకాదని నిరూపించే ప్రయత్నంలో లోకేష్ వున్నట్టు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు ఆయనకు పార్టీలో సముచిత గౌరవాన్ని కూడా కల్పించాలని పార్టీ అధ్యక్షుడిని కోరనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.