TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేష్ న్యాయ పోరాటం.. పాదయాత్రకి బ్రేక్!

Published on: Wed Jul 12, 2023 4:15PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట నాలుగువేల కిమీ పాదయాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ రెండు వేల కిమీ పాదయాత్ర పూర్తి చేసుకోగా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే, యువగళం యాత్రకు రెండు రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తనపై, తన కుటుంబంపై త‌ప్పుడు వార్తలు రాస్తూ, త‌న‌ని అప్రతిష్టపాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోందంటూ   గతంలో ఆయన ఒక దినపత్రికపై ప‌రువున‌ష్టం దావా వేశారు. వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా బాధ్యులు కూడా త‌న‌ని టార్గెట్ చేస్తున్నారంటూ క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు. 

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిష‌న‌ర్ అయిన నారా లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో   శుక్రవారం (జూలై 13) న‌మోదు చేయ‌నున్నారు. దీంతో యువ‌గ‌ళం పాద‌యాత్రకి  శుక్రవారం (జులై 13), శనివారం (జూలై 14) ల‌లో విరామం ప్రక‌టించారు. 12న పాదయాత్ర ముగించుకొని లోకేష్  అమ‌రావ‌తి కి వెళ్లనున్నారు. అనంతరం మళ్ళీ  ఆదివారం (జూలై15) యువగళం యాత్ర పునఃప్రారంభం కానుంది.

కాగా, గతంలో వైసీపీ నేతలు.. టీడీపీ, చంద్రబాబు, నందమూరి కుటుంబాలపై తీవ్రంగా విషం చిమ్మిన సంగతి తెలిసిందే. చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై కూడా చంద్రబాబుపై అసత్య ప్రచారం చేశారు. అలాగే ఆ మధ్య లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహ‌త్యపై కూడా వైసీపీ నేతలు సోష‌ల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన లోకేష్ అప్పట్లో  క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు విచారణకి వచ్చాయి. 

ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ హిల్స్ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విష‌ప్రచారం చేశారు. ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారని ఫేక్ ప్రచారం చేశారు.  త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటికి లోకేష్ త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి కార్యాల‌యాల‌కు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివ‌రికి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు. 

మరో వైసీపీ నేత, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సెప్టెంబ‌రు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని.. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని   ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు భువనేశ్వరి, బ్రాహ్మణిలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌పైనా మందూ మగువ అంటూ వ్యాఖ్యలు చేశారు.  సునీత చేసిన దారుణ‌మైన   వ్యాఖ్యలపై లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖ‌లు చేశారు. త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌ల‌ని ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ‌పోరాటం మొద‌లుపెట్టారు. ఇప్పుడు ఈ కేసులలో లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు చేయనుంది.