బుసాన్‌లో లోకేష్.. పెట్టుబడుల వేట. !
Published on: Wed Jul 8, 2026 9:23AM

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన సాగుతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా, లోకేశ్ బుధవారం ( జులై 8) కొరియా ప్రధాన వాణిజ్య నగరమైన బుసాన్‌కు చేరుకున్నారు. సియోల్ నుంచి రైలు మార్గం ద్వారా ఆయన బుసాన్ వెళ్లారు.
బుసాన్ పర్యటనలో మంత్రి లోకేశ్ ఏపీఈడీబీ' (ఆంధ్రప్రదేశ్ ఎక్స్ టర్నల్ ఎంగేజ్ మెంట్, కొరియా) పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన అపెక్స్-కొరియా విభాగాన్ని ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపే కొరియా పారిశ్రామికవేత్తలకు ఈ విభాగం ఒక ప్రధాన సహాయక, అనుసంధాన కేంద్రంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి, కొరియన్ పారిశ్రామిక సంస్థలకు మధ్య సమన్వయం వేగవంతమౌతుంది. అలాగే.. కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (కేఓఎమ్ఈఏ) రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. ఏపీలో భౌగోళిక అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వెసులుబాట్లు, పారిశ్రామిక మౌలిక వసతుల గురించి ఆయన అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా బీఎన్‌కే ఫైనాన్షియల్, బూయాంగ్ గ్రూప్ , హ్యుంగ్ సాంగ్ గ్రూప్ వంటి ప్రపంచస్థాయి సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి సమావేశం అవుతారు. ఈ చర్చల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు వీలయ్యే అవకాశాలపై ఆయన సంప్రదింపులు జరుపుతారు. అలాగే.. పారిశ్రామిక నైపుణ్యాలను పరిశీలించేందుకు బుధవారం (జులై 8) సాయంత్రం అక్కడి షూఆల్స్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించనున్నారు. బుసాన్ లో పర్యటన ముగించుకుని బుధవారం (జులై 8) రాత్రికి సియోల్ చేరుకుంటారు.
Andhra Pradesh Investments, South Korea Visit, APEX Korea, Busan, KOMEA, Teluguone


