TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుతోనే పోటీ అంటున్న లోకేష్

Published on: Sat Apr 5, 2025 8:59AM

తండ్రితోనే తన పోటీ అంటున్నారు మంత్రి నారా లోకేష్. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేవారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతీ విషయంలో చంద్రబాబుతో పోటీపడేందుకు ప్రయత్నిస్తానన్నారు. కుప్పం మెజార్టీ  కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.  మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానన్నారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవనీ, భూగర్భ విద్యుత్‌తో పాటు, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పానని,  తాను ఎక్కడికి వెళ్లినా మంగళగిరి తన గుండెల్లో ఉంటుందని వెల్లడించారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తా అని చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించి 26 సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండగా అమలు చేశానని గుర్తుచేశారు.