TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్

Published on: Sat Oct 18, 2025 1:00PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున అందిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ పర్యటన చేస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హైకమిషనర్ మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..  స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది.

ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్  అక్కడ  విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడ అనుసరిస్తున్న  విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.  పర్యటనలో భాగంగా లోకేశ్ ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు.  అలాగే, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు.

అదే విధంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపడంతో పాటు మెల్‌బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను పరిశీలిస్తారు. ఈ నెల‌ 19న సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో  కూడా లోకేష్ పాల్గొంటారు.  24 రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.