కేంద్రంపై యుద్దం.. అంత ధైర్యం ఎక్కడినుండి వచ్చింది..!

 

గతంలో తండ్రి చాటు బిడ్డ అని... సరిగ్గా మాట్లాడటం కూడా రాదు అన్న ముద్ర నారా లోకేశ్ పై ఉండేది. కానీ మంత్రి అయిన తరువాత లోకేశ్ కు కాస్త రాజకీయ పరిజ్ఞానం పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఏకంగా కేంద్రంపైనే యుద్దానికి దిగాడు. అసలు సంగతేంటంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు కు లేఖ రాసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ లేఖలో షా ఏం రాశారంటే... ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నానన్నారు. ఈ నిర్ణయం ఆశ్చర్యం, భాదను కలిగించిందని... టీడీపీ, ఏపీ ప్రజలు బీజేపీకి నిజమైన స్నేహితులని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి మోదీ సహకరించారని... రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూవెనకడుగు వేయలేదన్నారు. అంతేకాదు...ఇంకా నాలుగేళ్ల సాయంపై కూడా స్పందించి.. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనుల్ని షా ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని... కేంద్రం నుంచి కేటాయించిన నిధుల వివరాలను చెప్పుకొచ్చారు. పోలవరం, రాజధాని కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించామన్నారు. మూడు ఎయిర్‌పోర్టుల్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దామన్నారు. ఇలా చెప్పిన ప్రతి హామీని దాదాపుగా నెరవేర్చామని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామని... మెట్రో రైలుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపామన్నారు. మొత్తం 9 పేజీలతో అమిత్ షా ఈ లేఖ రాశారు.

 

దీంతో ఈ లేఖపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆశ్చర్యంగా లోకేష్ ముందు స్పందించి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చాడు. అమిత్ షా లేఖ చూసాక ఆయనకి రాష్ట్ర సమస్యల మీద అవగాహన లేనట్టు అర్ధం అయ్యిందని...ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కేంద్రం మీద వున్న అసంతృప్తిని సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు వివరించినా ప్రధాని మోడీ పట్టించుకోలేదని...కేంద్రానికి ఎప్పటికప్పుడు వివిధ పనులకి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ పంపుతున్నామని చెప్పిన లోకేష్ …అసలు వాటికి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబంధం ఏంటని నిలదీశారు. దీంతో ఈ టైంలో లోకేష్ కేంద్రంపై ఇలాంటి కామెంట్లు చేయడం సాహసం చేసినట్టే అని అనుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు... ఇప్పటికే చంద్రబాబుపై కేంద్రం మండిపడుతుంది... దానికి తోడు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు.. అన్నింటికీ మించి...నారా లోకేష్ పై ఓ రేంజ్ లో అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో లోకేశ్ ఇలా మాట్లాడటం నిజంగా ధైర్యం చేసినట్టే. అంతేకాదు ఇంత ధైర్యం లోకేశ్ కు ఎక్కడినట్టు వచ్చిందో అని అప్పుడే రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. దీనిబట్టి చూస్తే.. మోడీ - అమిత్ షా ద్వయాన్ని దీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ గట్టిగానే ప్రిపేర్ అయినట్టు ఉంది..